|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 04:19 PM
చిన్న చేప ముల్లు ముప్పు మహిళను తిప్పలు పెట్టింది.. ఏకంగా గుండెకు గుచ్చుకోవడంతో భరించలేని నొప్పి. నేరుగా ఆస్పత్రికి వెళితే డాక్టర్లకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఆమెకు 12 గంటల పాటూ సర్జరీ చేయడం కష్టంగా ఉంటుందని.. అందరూ కలిసి చర్చించుకుని అరుదైన సర్జరీ చేయాలని నిర్ణయించారు. కేవలం మూడు గంటల్లోనే అరుదైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.. కాకినాడలో ఈ ఘటన జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన జంప జంగాయమ్మ వయసు 54 ఏళ్లు.. ఆమె ఇంట్లో గత నెల 25న చేపల కూరతో భోజనం చేస్తున్నారు. అయితే పొరపాటున ఒక చేపముల్లును మింగేశారు.. చిన్న ముల్లే కదా ఏముందిలే అనుకుని వదిలేశారు. ఆ తర్వాత ఛాతి భాగంలో నొప్పి మొదలైంది.. భరించలేని నొప్పిత బాధపడ్డారు. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సిటీ స్కాన్ చేయించుకోవాలని సూచించారు.. స్కాన్ చేసి చూస్తే.. 4 సెంటీమీటర్ల పొడవున్న ఓ చేప ముల్లు మహిళ అన్నవాహిక నుంచి వెళ్లి.. నేరుగా గుండె పక్కన ఉండే పెద్ద రక్తనాళమైన బృహద్ధమనికి గుచ్చుకున్నట్లు తేలింది.
ఈ ముల్లును తొలగించాలంటే.. ఛాతి దగ్గర సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే దాదాపు 12 గంటల వరకు సమయం పడుతుంది.. ఈ సర్జరీ కాస్త క్లిష్టంగా ఉంటుంది. అందుకే డాక్టర్లు చర్చించుకుని అరుదైన సర్జరీ చేయాలని నిర్ణయించారు. బాధితురాలి తొడ దగ్గర రంధ్రం చేసి ఆ ముల్లును తొలగించారు.. ఈ సర్జరీకి మూడు గంటల సమయం పట్టింది. దీనిని తేవార్ పద్ధతి అని చెబుతున్నారు.. ఆమెకు రెండు కుట్లు మాత్రమే అవసరమయ్యాయి. ఈ ప్రక్రియ ద్వారా సర్జరీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో తొలిసారని.. దేశంలో రెండోసారని డాక్టర్లు చెబుతున్నారు. షేషెంట్ కోలుకోవడంతో నాలుగు రోజుల్లోనే డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. చిన్న ముల్లే కదా అనుకుంటే ఎంత పని చేసింది.. చేపలు తినేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.
Latest News