|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 04:14 PM
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులు ఇలా.. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా.. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో లెదర్ పార్కు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. వినుకొండ మండలం వెంకుపాలెం వద్దప లెదర్ పార్కు ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. వెంకుపాలెంలో లెదర్ పార్కు ఏర్పాటు కోసం థాయిలాండ్ కంపెనీ ప్రయత్నిస్తోంది. గురువారం థాయిలాండ్‌కు చెందిన ప్రైమ్ ఏసియా సంస్థ ప్రతినిధులు.. వెంకుపాలెంలో స్థలాన్ని పరిశీలించారు. వెంకుపాలెంలోని ఒకటో సర్వే నంబర్‌లో ఉన్న స్థలాన్ని ప్రైమ్ ఏసియా కంపెనీ ప్రతినిధులు.. అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.
వెంకుపాలెంలో రూ.520 కోట్లతో లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రైమ్ ఏసియా కంపెనీ భావిస్తోంది. 2026లోగా లెదర్ పార్క్ నిర్మాణ పనులు ప్రారంభించాలని భావిస్తోంది. అలాగే 2027లోగా లెదర్ పార్క్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే వెంకుపాలెంలోని సర్వే నంబర్ 1లో ఉన్న 98 ఎకరాల భూమిని లెదర్ పార్క్ ఏర్పాటు కోసం ప్రతిపాదించారు. ఈ మేరకు ఏపీఐఐసీకి ప్రతిపాదనలు పంపారు.
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గత ఫిబ్రవరిలో ఈ స్థలాన్ని చదును కూడా చేయించారు. తాజాగా ప్రైమ్ ఏసియా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బ్రైట్‌లీ, మరో ముగ్గురు సభ్యులు వెంకుపాలెంలోని స్థలాన్ని పరిశీలన చేశారు. అన్ని అనుమతులు లభిస్తే వచ్చే ఏడాది నిర్మాణాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు,
మరోవైపు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీలో 9 లెదర్ పార్కులు, 2 లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు నెలకొల్పాలని నిర్ణయించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని భావించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాలో లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరులో 18 ఎకరాలు , ప్రకాశం జిల్లా యడవల్లిలో 27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు నెలకొల్పాలని అప్పట్లో భావించారు.
Latest News