|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 12:20 PM
రాష్ట్రంలో పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాకంపై ఆశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్‌తో సహా బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రభుత్వపరంగా విద్యాసంస్థల్లో ఇచ్చే అడ్మీషన్లను వాయిదా వేయాలని కోరారు. అయన మాట్లాడుతూ.... ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్ర స్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేయించారు. విద్యార్ధుల భవిష్యత్తుకు కీలకమైన పదోతరగతి పరీక్షలను, జవాబుపత్రాల మూల్యాంకనంను లేనిపోని గొప్పలకు పోయి, అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఫలితాలను వెలువరిస్తామంటూ చేసిన హడావుడికి ఎందరో విద్యార్దులు నష్టపోయారు. పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారం రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేయాలంటూ టీచర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం అయిదు రోజుల్లో పూర్తి చేశారనే విషయం బయటపడింది. ఏప్రిల్ 1న పరీక్షలు పూర్తయితే, ఏప్రిల్ 23న ఫలితాలను వెలువరించారు. అంటే దాదాపు 21 రోజులు తీసుకున్నారు. 2022-23 లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కేవలం 17 రోజుల్లోనే సమర్థంగా పరీక్షా ఫలితాలను విడుదల చేసింది అని తెలిపారు.
Latest News