|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 12:19 PM
కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంను పోలీసులతో అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున దీనిని విజయవంతం చేశారని మాజీ మంత్రి, గుంటూరుజిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీల దివాలాకోరుతనం బయటపడకుండా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని కూడా ప్రయోగించారని మండిపడ్డారు. మరోవైపు పోటీగా దీపావళి, సంక్రాంతి అంటూ సంబరాలు చేసుకోవాలని కూటమి పార్టీలు ఇచ్చిన పిలుపును ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. అయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఏడాది మోసపూరిత, అస్తవ్యస్త పాలనపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం`కు అనూహ్య ప్రజాస్పందన వచ్చింది. మా పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 175 నియోజకవర్గాల నుంచి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు చరమగీతం పాడాలని ప్రతినబూనారు. తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక విధానాలపై కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాం. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని మా నాయకులపై చేస్తున్న వేధింపులను, అక్రమ కేసులను కూడా లెక్కచేయకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా నిరసన కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకు జనసేన, టీడీపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టారు. ఏడాది పాలనను పండగలా చేసుకోవాలని తెలుగుదేశం ఇచ్చిన పిలుపును ఆ పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు. `వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో మా ఇళ్ల చుట్టూ ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. అయినా వైయస్సార్సీపీ కార్యకర్తలు వాటిని లెక్కచేయకుండా పార్టీ జెండాలను భుజాన వేసుకుని రోడ్డు మీదకొచ్చి డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ ప్రభుత్వ విధానాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను, తిరుగుబాటును అంచనా వేసి చంద్రబాబు తన పాలనా విధానాన్ని మార్చుకోవాలి అని అన్నారు.
Latest News