|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 10:51 AM
కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి సృష్టిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఆర్‌టీఐ విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్ధి, ఉపాధ్యాయుల రేషియోలో అశాస్త్రీయ విధానం కారణంగా దాదాపు 10వేల మంది స్కూల్ అసిస్టెంట్‌లను సర్‌ప్లస్‌గా చూపే పరిస్థితిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ, మరోవైపు డీఎస్సీలో కొత్త టీచర్ పోస్ట్‌లను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. డీఎస్సీలో కూడా పోస్ట్‌లను తగ్గించేందుకే ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలను కక్షతోనే నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఆమె మాట్లాడుతూ.... టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. నలబైశాతం డిజైబులిటీ, బ్లైండ్ కేటగిరి వారిని ఫ్రిఫరెన్షియల్ కేటగిరిలో చూపించాలి. వారి విల్లింగ్ మేరకే బదిలీలు చేయాలి. వీటిని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు కోర్ట్‌కు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అన్ మ్యారీడ్ లేడీస్ కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరిలో ఉండేవారు, కానీ తాజాగా కూటమి ప్రభుత్వం 45 ఏళ్ళు దాటిన తరువాత 5 పాయింట్లు ఇస్తామంటున్నారు. ఇది కూడా సరికాదు. మహిళా ఉపాధ్యాయులకు ఉన్న వెసులుబాటును గౌరవించాలి. అలాగే జీఓ 342 జీఓ ప్రకారం స్టడీ లీవులో ఉన్న వారి పోస్ట్‌లను వేకెన్సీలుగా చూపించకూడదు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా బదిలీల్లో ఆ స్థానాలను ఖాళీగా చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులు ఉపాధ్యాయ లోకంలో ఆందోళనలు కలిగిస్తోంది అని అన్నారు.
Latest News