|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:22 PM
20 ఏళ్ల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టిగా పునాదులు వేశానని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ అన్నారు. శనివారం నాడు చంద్రబాబుతో భేటీ తర్వాత వర్మ కీలక ప్రకటన చేశారు. తాను ఎప్పుడూ ఇంకో పార్టీలోకి వెళ్లలేదని తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ పొత్తులతో తాను మనస్తాపం చెందానని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బిజీతో తనకు సమాచారం ఇవ్వలేదని.. ఈ విషయంతో కార్యకర్తలు మాత్రం ఆందోళన చేపట్టారని అన్నారు. చంద్రబాబు.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.వైసీపీ పూర్తిగా అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. వైసీపీ నేతలు వంగా గీత, దొరబాబులు పిఠాపురాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని చంద్రబాబును కోరానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. తనకు మంచి భవిష్యత్తు ఇస్తానని మాట ఇచ్చారని అన్నారు. తమ ప్రాంత రైతుల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చారని.. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఆయన పిలిస్తే వెళ్లి మాట్లాడతానని చెప్పారు. పార్టీ నిర్ణయాలు తనకు బాధ కలిగించాయన్నారు. కొన్ని నిర్ణయాలు చంద్రబాబు చేతిలో కూడా ఉండవని అన్నారు. పవన్ కళ్యాణ్ పోటీతో తనకు టికెట్ రాలేదని.. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే తానే ఇక్కడి నుంచి పోటీచేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలను తాను తప్పకుండా పాటిస్తానని వర్మ పేర్కొన్నారు.
Latest News