|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:54 PM
రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, అలానే పక్క రాష్ట్రమైన ఒడిశాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదికి వరద నీరు పోటెత్తింది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద గురువారం ఉదయం 6గంటలకు 15,381 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం నమోదైంది. 11 గంటలకు 23,400 క్యూసెక్కులు నమోదు కాగా.. అధికారులు అప్రమత్తమై మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 3గంటలకు 72,200 క్యూసెక్కులు నీటి ప్రవాహం నమోదు కాగా.. 63,830 క్యూసెక్కుల వరదనీటిని దిగువ ప్రాంతానికి విడిచిపెట్టారు. గొట్టా బ్యారేజ్ 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడిచిపెట్టామని బ్యారేజ్ నిర్వాహక ఇంజనీరు డీఈ డి.ప్రదీప్ తెలిపారు. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు మురళీమోహన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 08942-240557 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, వంశధార ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాలకొండ-హడ్డుబంగి రహదారిలో మాతల గ్రామం వద్ద ప్రధాన రహదారిపైకి నీరు చేరింది. కుద్దిగాం, కురిగాం, పొన్నుటూరు, రాయల, దిమిలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నివగాం, మదనాపురం, సోమరాజపురం రహదారిపై కూడా నీరు చేరింది. వందలాది ఎకరాల పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.
Latest News