☼ Suryaa News
🔴 తెలంగాణ నాగోల్‌ హత్య కేసును ఛేదించిన ఎస్‌ఓటీ, నాగోల్‌ పోలీసులు
తెలంగాణ

నాగోల్‌ హత్య కేసును ఛేదించిన ఎస్‌ఓటీ, నాగోల్‌ పోలీసులు

16 Sep 2026 Reporter

 

సూర్య క్రైమ్ న్యూస్ ప్రతినిధి : నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ నెల 14న జరిగిన మహ్మద్‌ నయీమ్‌ హత్య కేసును ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్‌ జోన్‌ బృందం, నాగోల్‌ పోలీసులు ఛేదించారు. కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నాగోల్‌ పీఎస్‌ క్రైమ్‌ నంబర్‌ 577/2026, బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 103(2) కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్న మహ్మద్‌ నయీమ్‌ (31)ను సెప్టెంబరు 14న నాగోల్‌ బండ్లగూడలోని సుప్రీమ్‌ వైన్స్‌ వద్ద నిందితులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. నయీమ్‌, కనకం ఉమామహేశ్‌, సయ్యద్‌ రబ్బానీ, ఓట్ల దినకర్‌ గతంలో ఒకరికొకరు పరిచయస్తులని, ఉప్పల్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు క్రిమినల్‌ కేసుల్లో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవలి విభేదాలు, బెదిరింపుల నేపథ్యంలో ఉమామహేశ్‌, రబ్బానీ, దినకర్‌ కలిసి నయీమ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. రబ్బానీ తన మాజీ జైలు సహచరుడు రసుమళ్ల సాకేత్‌ను సంప్రదించగా, అతని ద్వారా వొల్లిపొల్ల మహేశ్‌, అతని సహచరులను పథకంలోకి చేర్చినట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 13న నిందితులు ఖమ్మంలో సమావేశమై రాత్రి అక్కడే ఉండి హత్యకు సంబంధించిన ప్రణాళికను చర్చించినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు హైదరాబాద్‌కు వచ్చి పథకాన్ని అమలు చేసినట్లు వెల్లడించారు.

అరెస్టయిన నిందితులు: సయ్యద్‌ రబ్బానీ (21), ఓట్ల దినకర్‌ (35), వొల్లిపొల్ల మహేశ్‌ (23), రసుమళ్ల సాకేత్‌ (26), అలకుంట వెంకట్‌ (22), కోడిగంటి రాఘవేందర్‌ అలియాస్‌ రఘు (27), వల్లపుడాసు చరణ్‌ గౌడ్‌ (18), మహ్మద్‌ బద్రుల్లా హుస్సేన్‌ అలియాస్‌ బద్రి (44), తొడేటి వెంకటేష్‌ (31).
పరారీలో ఉన్న నిందితులు: కనకం ఉమామహేశ్‌, మహ్మద్‌ ఇస్మాయిల్‌ జాబి, భోలే, కార్తిక్‌. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
స్వాధీనం చేసుకున్న వస్తువులు: వేట కొడవలి, ఇనుప కడాయి, టయోటా కారు (ఏపీ 40ఎచ్ఏం 4669), రెండు ద్విచక్ర వాహనాలు (టీిఎస్ 28 ఎచ్3703 గ్లామర్‌, టీిజీ10డి0282 సుజుకీ యాక్సెస్‌).
ఈ అరెస్టులు మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి, ఐపీఎస్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ బి. అనురాధ, ఎస్‌ఓటీ డీసీపీ కె. మనోహర్‌ తదితర ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో జరిగాయి.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home