☼ Suryaa News
🔴 క్రీడలు ISSF జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
క్రీడలు

ISSF జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

19 Sep 2026 vasu

పురుషుల ట్రాప్‌లో మెరిసిన యుగన్ శక్తివేల్
పోర్పెట్టో (ఇటలీ): ఇటలీలోని పోర్పెట్టో వేదికగా జరుగుతున్న 'ISSF జూనియర్ ప్రపంచ కప్ షాట్‌గన్ 2026' పోటీలలో భారతదేశానికి తొలి పతకం లభించింది. పురుషుల ట్రాప్ విభాగంలో తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల యువ షూటర్ యుగన్ శక్తివేల్ ముత్తుకుమార్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఎనిమిది మంది షూటర్లు పోటీపడిన ఫైనల్ రౌండ్‌లో యుగన్ సంపూర్ణ ఆధిక్యాన్ని కనబరిచాడు. నిర్ణీత 30 టార్గెట్లలో 27 టార్గెట్లను సమర్థవంతంగా ఛేదించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటలీకి చెందిన ఫ్రాన్సిస్కో టాన్‌ఫోగ్లియోపై కేవలం ఒక్క టార్గెట్ తేడాతో విజయం సాధించి, బంగారు పతకాన్ని ముద్దాడాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో యుగన్ 125 పాయింట్లకు గాను 114 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి, తీవ్ర ఉత్కంఠభరితంగా జరిగిన షూట్-ఆఫ్‌లో గెలిచి మెడల్ రౌండ్‌కు అర్హత సాధించాడు.

ఇదే విభాగానికి చెందిన ఇతర భారతీయ షూటర్లు అర్జున్, వినయ్ ప్రతాప్ సింగ్ చంద్రావత్ చెరో 112 స్కోరుతో వరుసగా 12, 13వ స్థానాల్లో నిలవగా, ఉధవ్ సింగ్ రాథోర్ 111 స్కోరుతో 16వ స్థానంలో నిలిచారు.

మరోవైపు మహిళల ట్రాప్ విభాగంలో జూనియర్ ఆసియా ఛాంపియన్ సబీరా హారిస్ క్వాలిఫికేషన్‌లో 108 స్కోరుతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరినప్పటికీ, పతకం సాధించలేకపోయింది. ఫైనల్లో 15 టార్గెట్లకు 9 మాత్రమే ఛేదించి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మిగిలిన భారత షూటర్లు భవ్య త్రిపాఠి, క్రిషికా జోషి ఇద్దరూ 105 స్కోరు సాధించి తృప్తిలో ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుని 9, 10వ స్థానాల్లో నిలిచారు.

ఈ ఏడాది జరుగుతున్న రెండో ISSF జూనియర్ ప్రపంచ కప్ ఇది కాగా, ఈజిప్ట్‌లోని కైరోలో జరిగిన తొలి టోర్నీలో భారత్ 16 పతకాలతో (5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరగనున్న జూనియర్ మిక్స్‌డ్ టీమ్ ట్రాప్ ఈవెంట్‌తో పోర్పెట్టో టోర్నీ ముగియనుంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home