తజిందర్‌పాల్ స్థానంలో ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత పురుషుల పతాకధారిగా కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్ ఎంపికయ్యారు. సాంకేతిక సమస్యల కారణంగా షాట్‌పుట్ అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ స్థానంలో సెహ్రావత్‌ను ఎంపిక చేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తెలిపింది. దీంతో మహిళల విభాగంలో పతాకధారిగా వ్యవహరిస్తున్న రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, షూటర్ మను భాకర్‌తో కలిసి పవన్ సెహ్రావత్ భారత బృందానికి నాయకత్వం వహించనున్నారు.
ఆసియా క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణంపై కన్నేసిన తజిందర్‌పాల్ తూర్ తప్పుకోవడంతో, కబడ్డీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ సెహ్రావత్‌కు ఈ గౌరవం దక్కింది. మరోవైపు, పిస్టల్ ఈవెంట్లలో పోటీ పడుతున్న మను భాకర్ ఇప్పటికే ఒలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో భారత క్రీడాకారిణి క్విమ్సీ జోక్విమ్ డిసౌజా ఇండోనేషియాకు చెందిన సుమయ చేతిలో 1-2 తేడాతో ఓటమి పాలై ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. తొలి సెట్ గెలిచినప్పటికీ తర్వాతి సెట్లలో ప్రత్యర్థి పుంజుకోవడంతో డిసౌజాకు నిరాశ ఎదురైంది. డిసౌజా సెప్టెంబర్ 20న జరిగే కాంస్య పతక పోరులో జపాన్‌కు చెందిన యుయినా సకమోటాతో తలపడనుంది.