మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా
న్యూఢిల్లీ: భారతదేశ సెమీకండక్టర్ విధానం ఈ రంగానికి అత్యంత బలమైన పునాది వేసిందని, దేశం ఇప్పుడు మాట్లాడే స్థాయి నుండి ఆచరణ దశలోకి అడుగుపెట్టిందని మైక్రాన్ టెక్నాలజీస్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన 'సెమికాన్ ఇండియా 2026' ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
వచ్చే ఏడాది భారత్‌లో తమ కంపెనీ చిప్ అసెంబ్లీ మరియు టెస్టింగ్ సామర్థ్యాన్ని వందల కోట్ల చిప్‌లకు పెంచనున్నట్లు మెహ్రోత్రా ప్రకటించారు. ఈ ఏడాది ఆరంభంలో గుజరాత్‌లోని సనంద్‌లో 'ఇండియా సెమీకండక్టర్ మిషన్' కింద దేశంలోనే మొదటి సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ ఫెసిలిటీలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడి నుండి 'మేడ్ ఇన్ ఇండియా' లేబుల్‌తో తయారైన డీఆర్ఏఎం (DRAM), నాండ్ (NAND) ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు పంపిస్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది సనంద్ కేంద్రంలో పది కోట్ల చిప్‌లను అసెంబుల్ చేసి పరీక్షించామని, వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్యను వందల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. మైక్రాన్ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటికే భారతదేశంలోని మొత్తం ల్యాప్‌టాప్ మార్కెట్ అవసరాలను మించిపోయిందని వెల్లడించారు.
మైక్రాన్ భారతదేశంలో 7,000 మందికి పైగా ప్రత్యక్షంగా, విలువ గొలుసు అంతటా పదివేల మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరులోని తమ డిజైన్ సెంటర్లు గ్లోబల్ టెక్నాలజీ నెట్‌వర్క్‌లో కీలక భాగంగా మారాయని, ఇప్పటికే 3,700కు పైగా పేటెంట్లు మరియు ఆవిష్కరణలను నమోదు చేశాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరగడంతో తమ వ్యాపారంలో సుమారు 1,400 శాతం వృద్ధి నమోదైనట్లు ఈ సందర్భంగా సంజయ్ మెహ్రోత్రా పేర్కొన్నారు.