వాషింగ్టన్:ఆంక్షలకు గురైన ఇరాన్ ఫైనాన్షియర్ బాబక్ జంజానీ నియంత్రణలోని ‘బిట్‌బ్యాంక్’ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌పై అమెరికా గురువారం ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా ఓడల సురక్షిత ప్రయాణానికి అవసరమైన చెల్లింపుల ప్రాసెసింగ్‌తో పాటు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి వందల మిలియన్ డాలర్ల నిధులను ఈ ఎక్స్ఛేంజ్ మళ్లించిందని అమెరికా ట్రెజరీ శాఖ వెల్లడించింది. ఇరాన్ అమలు చేస్తున్న డిజిటల్ ఆస్తుల ఆధారిత ఆంక్షల ఎగవేత వ్యవస్థలో ఇది కీలకమైన భాగమని స్పష్టం చేసింది.
ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా చేపట్టిన "ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్" చర్యల్లో భాగంగానే ఈ ఆంక్షలు విధించినట్లు ట్రెజరీ శాఖ తెలిపింది. బిట్‌బ్యాంక్‌కు సాంకేతిక మద్దతు అందించిన పిష్తాజ్ సిమోర్గ్ ఎలక్ట్రానిక్ ట్రేడ్ కంపెనీతో పాటు, జంజానీకి చెందిన పలువురు కీలక సహచరులను కూడా అమెరికా ఈ ఆంక్షల జాబితాలో చేర్చింది. వాణిజ్య సంస్థల ముసుగులో ఐఆర్‌జీసీకి అక్రమంగా మనీలాండరింగ్ నిర్వహించడాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు.