సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోర్సవారిగూడెం పంచాయతీ పరిధిలో అందమైన అడవి మధ్యలో ఎత్తైన కొండలు, సెలయేర్ల నడుమ వెలసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ భక్తుల పూజలందుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలుగా ఉన్న గుహలో వెలయడం వల్ల ఈ పేరు వచ్చింది. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరుపొందడంతో, ప్రతిఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారికి గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ అటవీ ఉత్పత్తులు, రోకళ్లు, వెదురు చేటల విక్రయం ద్వారా అనేక మంది కొండరెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు.
మంగమ్మతల్లి వెలిసిన సమీపంలో సంతాన వృక్షంగా పేరుగాంచిన గానుగ చెట్టు ఉంది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్నాక పసుపు, కుంకుమను ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్మకు కడితే అమ్మ అనుగ్రహంతో సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతీ ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఆదివారాల్లో 3 వేల మందికి పైగా, మంగళ, శుక్రవారాల్లో 2 నుంచి 3 వేల మంది వరకూ భక్తులు వస్తుంటారు. కామవరం దాటిన తర్వాత దట్టమైన అడవి మార్గంలో సాగే ఈ ప్రయాణం భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, దొరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు.