భక్తి
నా కెరీర్ ఇక ముగిసిపోయిందనుకున్నా: ఐఐటీ రూర్కీ వేదికగా నాటి సిక్కిం ఆపరేషన్‌ను గుర్తుచేసుకున్న అజిత్ దోవల్
సూర్య జాతీయ డెస్క్: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన సుదీర్ఘ గూఢచార జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్టమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ రూర్కీ కాన్వొకేషన్ ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, యువ ఐపీఎస్ అధికారిగా ఉన్న సమయంలో తన వృత్తి జీవితం ముగిసిపోయిందని భావించిన నాటి ఉదంతాన్ని విద్యార్థులతో నెమరువేసుకున్నారు. సిక్కిం భారతదేశంలో విలీనమయ్యే కీలక తరుణంలో అక్కడ సరిహద్దు నిఘా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన ఈ నాటకీయ పరిణామం తన జీవితంలో మర్చిపోలేని మలుపు అని ఆయన వివరించారు.నాటి సంఘటనను వివరిస్తూ సరిహద్దు అవతలి చైనా సైనిక కార్యకలాపాలపై సమాచారం సేకరించేందుకు ఒక నిఘా బృందాన్ని పంపించామని, వారు ఐదారు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా పది రోజులు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించలేదని తెలిపారు. ఎటువంటి హిమపాతం లేదా ఇతర ప్రమాదాలు జరిగిన దాఖలాలు లేకపోవడంతో ఆ బృందం క్షేమసమాచారాలపై తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఆ సమయంలో ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ రాగా, సరిహద్దు దాటిన మన నిఘా సిబ్బంది చైనా బలగాల అదుపులో ఉన్నారన్న పిడుగులాంటి వార్త తెలిసిందని పేర్కొన్నారు. అనంతరం దౌత్య చర్చల ద్వారా తీవ్ర విచారణను ఎదుర్కొన్న ఆ బృందం తిరిగి దేశానికి చేరుకుందని దోవల్ వెల్లడించారు.ఆ తీవ్ర వైఫల్యంపై అంతర్గత విచారణ ప్రారంభమైనప్పుడు తన వయస్సు ఇరవైల్లోనే ఉందని, ఇక తన కెరీర్ ముగిసిపోయిందని, సరికొత్తగా మరో వృత్తిని వెతుక్కోవాల్సి వస్తుందని భయపడ్డానని దోవల్ గుర్తుచేసుకున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత ఆ తప్పు తనది కాదని, ప్రధాన కార్యాలయం సమకూర్చిన సరిహద్దు మ్యాపులు మరియు రేఖాచిత్రాలలో లోపాలు ఉండటం వల్లే సిబ్బంది సరిహద్దు దాటి చైనా సైన్యానికి చిక్కారని తేలడంతో విచారణ నుంచి విముక్తి లభించిందని తెలిపారు. విధి నిర్వహణలో అనుకోని సవాళ్లు, వైఫల్యాలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిలబడటమే భవిష్యత్తుకు మార్గదర్శకమని ఆయన విద్యార్థులకు హితవు పలికారు.