థ్యాంక్యూ ఎమ్మెల్యే దగ్గుపాటి
*పారిశుధ్య కార్మికుల పండగ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
*ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన సీఐటీయూ మున్సిపల్ కార్మికులు
*30మంది కార్మిక కుటుంబాలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు*
*అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని సత్కరించిన కార్మికులు
అనంతపురం బ్యూరో
గత 3సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటం ఫలించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి చొరవతో నగరపాలక సంస్థలో 30మంది కార్మికులకు ఉద్యోగాలు లభించాయి. ఈ నేపథ్యంలో అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. గత కొన్ని నెలలుగా మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం, వారి కుటుంబాల భద్రత కోసం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు, పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ప్రత్యేక చొరవ చూపారు. ఇటీవల చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో 12మందికి పదవీ విరమణ చెందిన కుటుంబాల్లో 18మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించారు. దీనిపై సీఐటీయూ మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ 30 నుండి 40 ఏళ్ల పాటు మున్సిపల్ కార్మికులుగా సేవలందించి, పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడుతున్న కుటుంబాలను కాపాడాలని, అలాగే విధి నిర్వహణలో ఉంటూ మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చాలా కాలంగా పోరాటం చేస్తున్నామన్నారు. దీనిపై స్పందించినందుకు ఎమ్మెల్యే, ప్రత్యేక అధికారి, కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులైన కార్మికులను భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అలాగే, అనంతపురం నగర జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా పని భారాన్ని తగ్గించేందుకు, నగరంలో పనికి తగిన విధంగా అదనపు మున్సిపల్ కార్మికులను నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు, కార్మికులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.