త్యాగాల పునాదులపై వచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం
స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు.. మన వారసత్వ సంపద
త్యాగధనుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలి
చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తే దేశభక్తి మరింత పెరుగుతుంది
దేశభక్తి ఉన్న లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండటం విద్యార్థుల అదృష్టం
‘భారతీయం’లో త్యాగధనుల పాత్రలతో అలరించిన విద్యార్థులు
సూర్య, స్టేట్ బ్యూరో :
త్యాగాల పునాదులపై వచ్చిన స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదని.. అది భారతీయుల వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి అందించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు, చరిత్ర పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఒక తండ్రి తన జీవితాంతం కష్టపడి ఇల్లు, పొలం, డబ్బు, బంగారం, ఆస్తులు సంపాదిస్తాడని.. తాను వాటిని తనతో తీసుకెళ్లలేనని తెలిసినా తన పిల్లలు వాటిని సద్వినియోగం చేసుకుని తనకంటే గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటాడని చాగంటి తెలిపారు. అదే సమయంలో ఆ సంపద వెనుక ఉన్న తన కష్టం, శ్రమ, విలువలు పిల్లలకు తెలియాలని ఆశిస్తాడన్నారు. మన దేశ స్వాతంత్ర్య సంగ్రామం కూడా అలాంటిదేనని చెప్పారు. ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛను అందించారని, ఆ స్వేచ్ఛను అనుభవించడం మాత్రమే కాకుండా దాని విలువను తెలుసుకుని కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. మన వంశం గురించి మనం తెలుసుకున్నట్లే దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల గురించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.
స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని మరవొద్దు
‘భారతీయం’ అనే మాట ఇప్పుడు పుట్టింది కాదని.. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే ఆ భావన బలపడిందని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు భారతదేశం గురించి నిర్ణయాలు భారతీయులే తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయని చెప్పారు. ‘సైమన్ గో బ్యాక్’ అంటూ నల్లజెండాలతో ప్రజలు ఉద్యమించారని, ఎందరో జైళ్లకు వెళ్లారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను పిల్లలకు తెలియజేస్తూ ఉండాలని, అప్పుడే వారిలో దేశభక్తి, నైతిక విలువలు బలపడతాయని అన్నారు.
త్యాగధనుల జీవితాలే స్ఫూర్తి
అండమాన్‌లోని కాలాపాని జైలును గురించి తెలుసుకుంటే స్వాతంత్ర్య సమరయోధులు అనుభవించిన కష్టాలు అర్థమవుతాయని చాగంటి తెలిపారు. ఇరుకైన గదులు, ఒంటరితనం, శారీరక హింసను ఎదుర్కొన్నా వారి సంకల్పం మాత్రం చెదరలేదన్నారు. గాంధీజీ, నెహ్రూ, లాలా లజపతిరాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల జీవితాలను చదివితే స్వాతంత్ర్యం ఎంతటి త్యాగాల ఫలితమో అర్థమవుతుందని చెప్పారు. బ్రిటిష్ పోలీసుల తుపాకీకి ఎదురుగా నిలిచిన ధైర్యసాహసాల కారణంగానే టంగుటూరి ప్రకాశం పంతులుకు ‘ఆంధ్రకేసరి’ బిరుదు లభించిందన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.
చారిత్రక ప్రదేశాలను సందర్శించాలి
మనకు దేవాలయాలు ఎంత పవిత్రమో.. స్వాతంత్ర్య సమరయోధులు జీవించిన జైళ్లు, స్మారకాలు, పోరాట ప్రదేశాలు కూడా అంతే ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలని చాగంటి అన్నారు. వాటిని సందర్శించినప్పుడు పిల్లల్లో ఆసక్తి పెరుగుతుందని, వాటి గురించి తెలుసుకున్నప్పుడు చరిత్ర అర్థమవుతుందని, చరిత్ర అర్థమైనప్పుడు దేశభక్తి మరింత బలపడుతుందని తెలిపారు. పిల్లలకు పుస్తకాలను బహుమతులుగా ఇవ్వాలని, స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలను చదివించాలని సూచించారు. అండమాన్ వంటి చారిత్రక ప్రదేశాలకు తీసుకెళ్లి మనకు లభించిన స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాలను వారికి తెలియజేయాలని అన్నారు.
దేశభక్తి ఉన్న లోకేష్ విద్యామంత్రి కావడం విద్యార్థుల అదృష్టం
పిల్లల్లో దేశభక్తి, నైతిక విలువలు, చరిత్ర పట్ల గౌరవం పెంపొందించాలనే ఉద్దేశంతో ‘భారతీయం’ కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనను మంత్రి నారా లోకేష్‌కు చెప్పగానే ఆయన వెంటనే స్పందించి కార్యక్రమానికి వస్తానని చెప్పారని చాగంటి తెలిపారు. కార్యక్రమం ప్రారంభ సమయాన్ని చెప్పిన దానికంటే ముందుగానే వచ్చి పాల్గొనడం ఆయనకు దేశం, చరిత్ర పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమన్నారు. ఆయనతో మాట్లాడి తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు వచ్చి డ్రైవర్‌ను ‘పెద్దాయన జాగ్రత్త’ అని చెప్పి వెళ్లారని గుర్తుచేశారు. ఇటువంటి దేశభక్తి ఉన్న లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉండటం విద్యార్థుల అదృష్టమని చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
త్యాగధనుల పాత్రలతో విద్యార్థుల సందడి
‘భారతీయం’ కార్యక్రమంలో విద్యార్థులు దేశానికి సేవలందించిన మహనీయుల పాత్రలను పోషించి ఆహూతులను ఆకట్టుకున్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అబ్దుల్ కలామ్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, తరిగొండ వెంగమాంబ, డొక్కా సీతమ్మ, సచిన్ టెండూల్కర్ తదితరుల పాత్రధారులు దేశభక్తిపై ఇచ్చిన సందేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు.
స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదని.. అది మన వర్తమానానికి పునాది, భవిష్యత్తుకు వారసత్వ సంపద అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు.