ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కీలక బాధ్యతలు అప్పగించింది. పరిపాలనా అవసరాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్పీఎఫ్ డీజీగా పనిచేస్తున్న సీహెచ్ త్రివిక్రమ్ వర్మను పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆర్.జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ చేశారు. ఏపీ ప్రత్యేక పోలీసు బెటాలియన్ల ఐజీగా ఉన్న బి.రాజకుమారిని రైల్వే ఐజీగా నియమించారు. సీఐడీ మహిళా భద్రతా విభాగం ఐజీగా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్ డీఐజీ బాబూజీ అట్టాడను సాంకేతిక సేవల డీఐజీగా బదిలీ చేసి, గ్రేహౌండ్స్ డీఐజీగా అదనపు బాధ్యతలు కొనసాగించాలని ఆదేశించారు. ఇటీవల తిరిగి విధుల్లో చేరిన కాంతి రాణా టాటాకు ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రత ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. విశాల్ గున్నిని శిక్షణ విభాగం డీఐజీగా నియమించి, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.మూడు కొత్త జిల్లాలకు కూడా ఎస్పీలను నియమించారు. మార్కాపురం జిల్లా ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ అదహళ్లి, పోలవరం జిల్లా ఎస్పీగా కె.చక్రవర్తిని నియమించారు. ఈ నియామకాలతో కొత్త జిల్లాల పోలీసు పరిపాలనకు కొత్త నాయకత్వం ఏర్పడింది.