సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని భూ యజమానులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ హక్కులు పొందిన 7,85,500 ఎకరాల భూములతో పాటు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పలు విభాగాల భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సాంకేతిక, పరిపాలనాపరమైన చిక్కుల వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఈ నిర్ణయంతో స్పష్టమైన మార్గం సుగమమైంది. అసైన్డ్ భూములుగా రికార్డుల్లో తప్పుగా నమోదైన ప్రైవేట్ పట్టా భూములు, చుక్కల భూములు, ప్రాజెక్టుల పరిధిలోకి రాని భూములకు సైతం రిజిస్ట్రేషన్ల నుంచి వెసులుబాటు కల్పిస్తూ సమగ్ర మార్గదర్శకాలను ఖరారు చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం, అర్హత కలిగిన ప్రైవేట్ పట్టా భూములు 5,422 ఎకరాలు, ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్న 64,143 ఎకరాలు మరియు చుక్కల భూముల చట్టం పరిధిలోని 17,897 ఎకరాలకు రిజిస్ట్రేషన్ల వెసులుబాటు దక్కింది. అయితే, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలను కూడా అమల్లోకి తెచ్చింది. అసైన్‌మెంట్ జరిగి 20 ఏళ్ల గడువు పూర్తికాని భూములు, నిబంధనలు ఉల్లంఘించి ఫ్రీహోల్డ్ చేసిన భూములు, అర్హులైన లబ్ధిదారుల స్వాధీనంలో లేని భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. తగిన ఆధారాలు లేని భూములను హోల్డ్‌లో ఉంచి ప్రత్యేక విచారణ జరిపించాలని నిర్ణయించింది.
భూ వివాదాల పరిష్కారం మరియు ఫ్రీహోల్డ్ హక్కుల మంజూరు ప్రక్రియను సులభతరం చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి వెలుపల ఉన్న ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన బాధ్యతను సంబంధిత ఆర్డీవో మరియు సబ్ కలెక్టర్లకు అప్పగించారు. భూ యజమానులు లేదా లబ్ధిదారులు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్డీవో ఇచ్చే నిర్ణయాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా జాయింట్ కలెక్టర్ వద్ద అప్పీలు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అక్రమాలు జరిగినట్లు తేలిన భూములపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.