ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం.. కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 08:08 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సుదీర్ఘ మంత్రిమండలి సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో.. పరిపాలనలో పలు కీలక మార్పులకు నాంది పలికింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ.. విద్యుత్ రంగంలో సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


రాష్ట్రంలో పట్టణీకరణ వేగం పెరిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంత్రివర్గం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ‘ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)’ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


విలీనం కానున్న ముఖ్య ప్రాంతాల్లో.. పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్ ఉన్నాయి.


ఈ విలీనం ద్వారా జీహెచ్ఎంసీ పరిధి.. జనాభా భారీగా విస్తరించనుంది. ఈ ప్రాంతాల అభివృద్ధికి అదనపు నిధులు, మెరుగైన మౌలిక వసతులు, పౌర సేవలు లభించే అవకాశం ఉంది. విద్యుత్ రంగంలో ఉన్న నష్టాలను తగ్గించడానికి, సరఫరాను మెరుగుపరచడానికి ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.


తెలంగాణలో జనవరి 2026 నాటికి మూడో డిస్కం (విద్యుత్ పంపిణీ సంస్థ) ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్‌పై ఉన్న రూ. 59,671 కోట్ల నష్టాల భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రస్తుత డిస్కంల పరిధిలో ఉండగా.. మిషన్ భగీరథ, మెట్రో వాటర్ బోర్డులకు సంబంధించిన విద్యుత్ సరఫరాను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు టెండర్లను పిలవాలని ఆమోదం తెలిపారు.


ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాల్వాంచ, మక్తల్ ప్రాంతాల్లోనూ కొత్త ప్లాంట్ల నిర్మాణ అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. కొత్త పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.


హైదరాబాద్‌లో భూగర్భ కేబుల్ వ్యవస్థ..


నగరంలో విద్యుత్ అంతరాయాలను తగ్గించడానికి.. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి హైదరాబాద్‌ను మూడు సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ (అండర్‌గ్రౌండ్ కేబుల్ సిస్టమ్) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబుల్‌తో పాటు టీ-ఫైబర్ కేబుళ్లను కూడా ఏర్పాటు చేయాలని క్యాబినెట్ ఆదేశించింది.


ఇతర నిర్ణయాలు ఇలా ఉన్నాయి..


ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చి, దీనికోసం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. అయితే.. డిస్కంల నుంచి విద్యుత్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదన తమకు అందలేదని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa