ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 07:59 PM

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) షెడ్యూల్‌ను విడుదల చేయడంతో.. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు తమ నాయకులను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్నికల సందడి మొదలైంది.


ఎస్‌ఈసీ అధికారిణి రాణి కుముదిని ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో జరుగనుంది. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ జరిగిన రోజునే.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.


షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ (Model Code of Conduct) వెంటనే అమల్లోకి వచ్చింది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదటి విడతకు నవంబర్ 27న, రెండో విడతకు నవంబర్ 30న, మూడో విడతకు డిసెంబర్ 3న ప్రారంభమవుతుంది.


రాష్ట్రంలోని మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు.. 1,12,288 వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానిక ఎన్నికలు గ్రామస్థాయి అభివృద్ధికి, సంక్షేమానికి పాలకవర్గాన్ని ఎన్నుకోవడంలో అత్యంత కీలకం కావడం వల్ల.. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.


గతంలో సెప్టెంబర్ 29న షెడ్యూల్ ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న దానిపై స్టే విధించారని ఆమె తెలియజేశారు. మొదటి విడతలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు.. 38,350 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడో విడతలో.. 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.


తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో.. రాష్ట్రంలోని గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామీణ పాలనా పీఠాలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను పదును పెడుతున్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనప్పటికీ.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తమ మద్దతుదారులైన అభ్యర్థులను (పార్టీ బలపరిచిన అభ్యర్థులను) నిలబెడతాయి. ఈ నేపథ్యంలో.. ఆయా పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏ అభ్యర్థిని ఎంపిక చేయాలనే దానిపై ప్రస్తుతం లోతైన చర్చల్లో, మల్లగుల్లాల్లో మునిగిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa