ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 07:26 PM

హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమాన్‌గల్లీలో జరిగిన ఘోర గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో సోనూ బాయ్ (40) అనే మహిళ దుర్మరణం పాలయ్యారు. ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్, లలితా బాయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషాద ఘటన గురించి తెలియగానే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అక్కడికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.


పునరావృతమవుతున్న ఎల్‌పిజి ప్రమాదాలు


వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎంతటి తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకు.. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని పద్మశాలీపురం సాయి కాలనీలో కూడా వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ.. అక్కడ ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.


గ్యాస్ స్టవ్‌లు, రెగ్యులేటర్లు, పైపులు నాణ్యత లేకుండా లేదా పాతబడి ఉండటం వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గ్యాస్ పైపులను ఎలుకలు కొరికి లీకేజీకి కారణం కావడం. వినియోగం తర్వాత రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయకపోవడం లేదా సిలిండర్‌ను సరిగ్గా అమర్చకపోవడం కూడా ఒక కారణం. ఇక చివరగా.. భద్రతా నియమాలు పాటించకపోవడం .. అంటే.. గ్యాస్ సిలిండర్లను సరిగ్గా నిల్వ చేయకపోవడం వంటి కారణాలతో గ్యాస్ సిలిండర్ పేలే అవకాశాలు ఉన్నాయి.


గ్యాస్ వాడుకలో తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


మన ఇళ్లలో మనం వాడుకునే ఎల్పీజీ సురక్షితమైనదే అయినా.. దాని నిర్వహణలో మనం పాటించాల్సిన కొన్ని ముఖ్య నియమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నుంచి తప్పించుకోవచ్చు.


సరైన పరికరాలు వాడటం.. గ్యాస్ స్టవ్‌కు సిలిండర్‌ను కలిపే రబ్బర్ గొట్టం (పైపు) నాణ్యమైనదై ఉండాలి. ప్రతీ 18 నెలలకోసారి లేదా రెండేళ్లకోసారి తప్పకుండా ఈ పైపును మార్చాలి. పైపుపై గడువు తేదీని పరిశీలించాలి. వంట పూర్తయిన వెంటనే.. కేవలం స్టవ్ నాబ్‌నే కాకుండా, సిలిండర్‌పై ఉన్న రెగ్యులేటర్‌ను కూడా తప్పకుండా ఆఫ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు లేదా ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఇది చాలా ముఖ్యమైన పని.


గ్యాస్ వాసన వచ్చిన వెంటనే భయపడకుండా.. వెంటనే తలుపులు, కిటికీలు తెరవాలి. గాలి బాగా ప్రసరించేలా చూడాలి. లీకేజీ వాసన వస్తే.. ఇంట్లోని విద్యుత్ స్విచ్‌లను (లైట్లు, ఫ్యాన్లు) అస్సలు వేయకూడదు. వాటి నుంచి వచ్చే చిన్న నిప్పు రవ్వ (స్పార్క్) కూడా పేలుడుకు కారణమవుతుంది. గ్యాస్ వాసన వస్తే.. వెంటనే రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసి, సిలిండర్ సరఫరాదారుకు లేదా అత్యవసర సేవలకు (అగ్నిమాపక దళం) సమాచారం ఇవ్వాలి. ఎప్పుడూ లీకేజీని అగ్గిపెట్టెతో పరీక్షించవద్దు. గ్యాస్ సిలిండర్ల నిల్వ విషయంలో కూడా కిచెన్‌లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. ఎల్పీజీ వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకుంటేనే ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా మనం కాపాడుకోగలం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa