తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ఒక చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఏకంగా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సాయుధ పోరాట మార్గాన్ని వీడి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. లొంగిపోయిన ఈ మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు.
లొంగిపోయిన వారిలో ముగ్గురు కీలకమైన రాష్ట్ర కమిటీ సభ్యులు ఉండటం ఈ లొంగుబాటులో అత్యంత ముఖ్యమైన అంశం. కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేశ్, సోమ్‌దా అలియాస్ ఎర్ర. వీరితో పాటు.. ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఈ 37 మందిలో.. ముగ్గురు మినహా మిగిలిన 34 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారని డీజీపీ వెల్లడించారు.
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గత అక్టోబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు జనజీవనంలో కలిసిపోవాలని ఇచ్చిన పిలుపుమేరకే వీరంతా ప్రభావితమై లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. ఈ లొంగుబాటుకు ప్రభుత్వం తరపున తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందజేశారు. వీరిపై ప్రకటించిన మొత్తం రివార్డు విలువ భారీగా ఉంది. ఒక్క ఆజాద్‌పై రూ.20 లక్షలు, అప్పాస్ నారాయణపై రూ.20 లక్షలు చొప్పున రివార్డు ప్రకటించబడింది. లొంగిపోయిన మావోయిస్టులందరిపైనా కలిపి మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. ఆ మొత్తాన్ని పూర్తిస్థాయిలో వారికే అందజేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన మావోయిస్టులకు ప్రభుత్వం ఇచ్చే పునరావాస ప్యాకేజీ పూర్తిగా అందుతుందని భరోసా ఇచ్చారు.
అజ్ఞాతంలో ఉన్న వారికి డీజీపీ సూచన..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వీరిలో ఐదుగురు కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేశ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్. వీరితో పాటు రాష్ట్ర కమిటీలో కూడా 10 మంది ఉన్నారని డీజీపీ వివరించారు.
శాంతియుత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో.. మిగిలిన మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి, వీలైనంత త్వరగా లొంగిపోవాలని ఆయన సూచించారు. లొంగిపోయిన వారికి జీవితాన్ని పునర్నిర్మించుకునేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందుతాయని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ ఉద్బోధించారు. ఈ భారీ లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిలువరించడానికి ఒక బలమైన సంకేతంగా చెప్పుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa