పాతబస్తీలో చారిత్రక బమృక్నుద్దౌలా చెరువు సర్వాంగ సుందరంగా సిద్ధమౌతోంది. నవంబరు నెలాఖరు నాటికి ఈ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే లక్ష్యంతో హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మంగళవారం బమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంపదగా భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ క్రమంలోనే చెరువు ఆక్రమణలను గత ఏడాది ఆగస్టు నెలలో తొలగించినట్టు చెప్పారు. 18 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కేవలం 4.12 ఎకరాలకు పరిమితమైపోగా.. ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు చెరువును 18 ఎకరాల మేర విస్తరించి.. వరద కట్టడితోపాటు.. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని హైడ్రా కమిషనర్ చెప్పారు. చెరువులోకి వరద నీరు చేరేలా.. నిండితే పోయేలా నిర్మించిన ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
చెరువు చుట్టూ బండ్ నిర్మించి వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. అలాగే చెరువు కట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. అలాగే చెరువు లోపలి వైపు కూడా ఎవరూ లోనకు వెళ్లకుండా గట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలు ఏర్పాటు చేస్తుననారు. అలాగే వృద్ధులు సేద దీరే విధంగా అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పార్కులు నిర్మిస్తున్నారు. ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ రహదారులు నిర్మించడంతో పాటు.. గ్రీనరీని పెంచే విధంగా మొక్కలు నాటుతున్నారు. పచ్చిక బైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే.. నగిషీలు చెక్కుతున్నారు. నిజాంల కాలంలో రాతితో నిర్మించిన బండ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుతూ.. మరింత పటిష్టం చేస్తున్నారు. చెరువులో కూడా మట్టిలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరుస్తున్నారు. ఔట్‌లెట్‌కు మళ్లీ గేట్లు బిగిస్తున్నారు. స్థానిక నివాసితులు అక్కడకు వచ్చి సేదదీరేవిధంగా రూపొందించడమే కాకుండా.. సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేస్తున్నారు.
చార్ సౌ షహర్ హమారా.. 435 ఏళ్లకు పైబడిన చరిత్ర ఈ నగరానిది. అడుగడుగునా చారిత్రక ఆనవాళ్లు, ఎన్నో విశేషాలు మన సొంతం. అలాంటి కోవలోకే వస్తుంది.. 1770లో హైదరాబాదు మూడవ నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్‌ఉద్‌దౌలా నిర్మించిన బమృక్నుద్దౌలా చెరువు. ఈ చెరువుకు సంబంధించిన సమాచారం స్థానికంగా ఉన్న వృద్ధులు పలు విధాలుగా వివరిస్తున్నారు. చారిత్ర ఆనవాళ్లు ప్రకారం వంద ఎకరాలకు పైగా ఈ చెరువు విస్తరించి ఉండేదని.. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని చెబుతున్నారు. నిజాంల కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమృక్నుద్దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చెబుతున్నారు. అలాగే బమృక్నుద్దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు వినియోగించేవారని మరి కొంతమంది వివరిస్తున్నారు. ఔషధగుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించేవారంటున్నారు. అంతే కాదు.. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని.. ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లేవారంటున్నారు. ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు సంబర పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa