ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎరుపు రంగు బట్టలు వేసుకోవద్దు.. సాయంత్రం 5 గంటల్లోపు ఇళ్లకు వెళ్లండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:11 PM

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని జిల్లాల ప్రజలకు అటవీ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. వారు ఎరుపు రంగు దుస్తులు ధరించవద్దని సూచించారు. అలానే ఉదయం 10 గంటల తర్వాతే బయటకు వెళ్లాలని.. సాయంత్రం 5 గంటల లోపు ఇళ్లకు చేరాలని సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులు రాత్రింబవళ్లు గస్తీ కాస్తున్నారు. మరి ఈ స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడానికి కారణం ఏంటంటే.. ఈ పరిసర ప్రాంతాల్లో పులి సంచరించడం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని మెట్ ఇంధాని అటవీ ప్రాంతానికి మహారాష్ట్ర సరిహద్దు నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. 2020 నుంచి ఇలా పత్తి పంట చేతికొచ్చే సమయానికి.. అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.


పులి.. పశువుల మీదనే కాక.. పొలాల్లో పని చేసే కూలీల మీద కూడా దాడి చేసి చంపేస్తుంది ఈ ఏడాది ఆగస్టు 18న సిర్పూర్ (టి) రేంజి పరిధిలోకి ప్రవేశించిన పులి ఒకటి.. ఆవు మీద దాడి చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పులి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఒక వారం రోజుల నుంచి ఇది మండలంలోని గెర్రెగూడ, రాస్పెల్లి, సార్సాల పరిసరాల్లో సంచరించిన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.


మూడు నెలల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన పులి.. వారం రోజుల నుంచి పెంచికల్పోట్, సిర్పూర్(టి), కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని పాతసార్సాల, గెర్రెగూడ, రాస్పెల్లి గ్రామ పరిసరాల్లో సంచరిస్తోంది. పత్తి పంట చేతికి వచ్చిన వేళ.. ఇలా పులి సంచరించడం.. రైతులను భయపెడుతోంది. గతంలో దాడి చేసిన ఘటనలు గుర్తు చేసుకుంటున్న రైతులు, కూలీలు పొలం పనులకు వెళ్లడానికే భయపడుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాల్లో రేయింబవళ్లు గస్తీ కాస్తున్నారు.


ఈనేపథ్యంలో అటవీశాఖ అధికారులు.. రైతులు, కూలీలకు పలు సూచనలు చేస్తున్నారు. జనాలు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లరాదని సూచిస్తున్నారు. పొలం పనులకు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు ఉదయం 10 గంటల తర్వాతే వెళ్లి, సాయంత్రం 5 గంటలలోపే ఇండ్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు. అలానే ఎర్రని దుస్తులు ధరించడం వల్ల పులితో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కనక.. అలంటి రంగు దుస్తులకు దూరంగా ఉండమని చెబుతున్నారు. అలానే పులి కనిపిస్తే.. వెనక్కి తిరిగి పరిగెత్తకూడదని.. పులికి మన వీపు కనిపిస్తే.. వెంబడించే ప్రమాదం ఉంది కనుక.. అలా చేయవద్దని.. పులి కనిపిస్తే పెద్దగా అరవాలని సూచించారు. ప్రమాదం ఉందని, పెద్దగా అరుపులు చేయాలని సూచిస్తున్నారు.


గత వారం రోజులుగా తమ ప్రాంతంలో పులి సంచరిస్తోందని.. పత్తి తీసే సమయంలో ఇలా పులి సంచారం వల్ల కూలీలు పనులకు రావడానికి భయపడుతున్నారని రాస్పెల్లికి చెందిన రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది గ్రామాల పరిసరాల్లోనే గస్తీ కాస్తున్నట్టు తెలిపారు. ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని అన్నారు.


సుమారు 5 సంవత్సరాల క్రితం అనగా.. 2020 నవంబరు 11న చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మీద పులి దాడి చేసి హతమార్చింది. అలానే గత సంవత్సరం అనగా 2024 నవంబర్ 29న గన్నారం గ్రామానికి లక్ష్మి అనే మహిళ చేలో పత్తి తీస్తుండగా.. పులి ఆమె మీద దాడి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa