ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మార్ట్ రోడ్డుగా హైదరాబాద్-విజయవాడ హైవే.. కెమెరాల నిఘా, ప్రమాదాలకు చెక్..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 07:17 PM

దేశంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటైన హైదరాబాద్‌- విజయవాడ (NH-65) జాతీయ రహదారి త్వరలో 'హై సెక్యూరిటీ స్మార్ట్‌ హైవే'గా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించడంతోపాటు అత్యంత ఆధునిక సాంకేతికతతో డిజిటల్ రోడ్డుగా మార్చనున్నారు. తెలంగాణ పరిధిలోని మల్కాపూర్‌ అందోల్‌ మైసమ్మ ఆలయం వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు వరకు దాదాపు 231.32 కిలోమీటర్ల మేర ఈ విస్తరణ జరగనుంది.


ఈ భారీ విస్తరణ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 10,391.53 కోట్లు నిధులు అవసరమవుతాయని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)లో అంచనా వేశారు. ఇందులో నిర్మాణ వ్యయం కోసం రూ. 6,775.47 కోట్లు, ఇతర అవసరాల కోసం రూ. 3,616.06 కోట్లు కేటాయించారు. డీపీఆర్ రూపకల్పన దాదాపు పూర్తికావడంతో, వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.


రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ రోడ్డును పూర్తిస్థాయిలో స్మార్ట్‌ హైవేగా తీర్చిదిద్దనున్నారు. దీనికోసం హైవేపై ప్రతి కిలోమీటర్‌కు రెండు వైపులా ఒకటి చొప్పున మొత్తం 231 అత్యాధునిక 360 డిగ్రీల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)తో అనుసంధానం చేస్తారు. స్పీడ్‌ డిటెక్షన్‌, రాంగ్‌ రూట్‌ వంటి నిబంధనల అతిక్రమణతో పాటు ప్రమాదాలు వంటివి జరిగితే వెంటనే లొకేషన్, కిలోమీటర్‌ నంబర్‌తో సహా వీడియో వివరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పంపుతాయి. దీని పర్యవేక్షణకు ప్రత్యేక మానిటరింగ్‌ కేంద్రాలను హైవేపై ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థను రాష్ట్ర పోలీసు, రవాణా శాఖకు అనుసంధానం చేయడం వల్ల రోడ్డుపై నిరంతరం 24 గంటలు నిఘా ఉంటుంది.


ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్టు గుర్తించిన 38 చోట్ల ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే 17 బ్లాక్‌స్పాట్‌ల వద్ద రోడ్ ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. రహదారికి ఇరువైపులా వాహనాలు కిందికి పడిపోకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. సోలార్‌ వీధి దీపాలు ఏర్పాటు చేయడంతోపాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. భవిష్యత్తులో రోడ్డును తవ్వకుండా ఉండేందుకు వీలుగా మంచినీటి సరఫరా, గ్యాస్‌ పైప్‌లైన్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లైన్లు వంటి అన్ని మౌలిక వసతులను నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేస్తున్నారు.


ఈ స్మార్ట్‌ హైవే విస్తరణ వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు గణనీయమైన ఊతమివ్వనుంది. ఈ రహదారి దాదాపు 50 ఇండస్ట్రియల్‌ పార్కులు, 20 ఎకనామిక్‌ నోడ్స్‌, 4 నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NICDC)లకు అనుసంధానం కానుంది. ఇది రెండు మేజర్‌ రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలకు కూడా అనుసంధానంగా మారనుంది. ప్రస్తుతం ఈ రోడ్డుపై రోజుకు 43,742 వాహనాలు తిరుగుతుండగా.. 2048 నాటికి ఈ సంఖ్య 1,71,251కి పెరుగుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa