|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 08:34 PM
ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్‌పై ఏకపక్షంగా దాడి ప్రారంభించిన అమెరికా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. యుద్ధం మొదలై దాదాపు మూడు వారాలు కావస్తున్నా, అది ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ విజయ ప్రకటనలు చేస్తున్నప్పటికీ, భూస్థాయిలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.ఈ క్రమంలో ట్రంప్ పరిపాలనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
*నెతన్యాహును లక్ష్యంగా పెట్టుకున్న ఇరాన్ : అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (NCTC) డైరెక్టర్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. వైట్‌హౌస్‌తో తీవ్రమైన విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధానికి నిరసనగానే తాను పదవిని వీడుతున్నానని తెలిపారు. ట్రంప్ పాలనలో యుద్ధానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన తొలి అత్యున్నత స్థాయి అధికారి ఆయనే.ఎక్స్‌లో చేసిన పోస్టులో కెంట్, దీర్ఘకాలంగా ఆలోచించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధానికి తాను మనస్సాక్షిగా మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు లేదని, ఇజ్రాయెల్ మరియు అమెరికన్ లాబీల ఒత్తిడితోనే ఈ యుద్ధం ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు.గ్రీన్ బెరెట్స్ మాజీ సభ్యుడైన కెంట్, ట్రంప్‌కు రాసిన తన రాజీనామా లేఖను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఆ లేఖలో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రారంభ దశలోనే కొందరు ఇజ్రాయెల్ అధికారులు, అమెరికన్ మీడియా ప్రముఖులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. ఈ ప్రచారం ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని దెబ్బతీసి, ఇరాన్‌పై యుద్ధానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించిందని విమర్శించారు.ఇరాన్‌ను తక్షణ ముప్పుగా చూపిస్తూ, వెంటనే దాడి చేస్తే సులభంగా విజయం సాధించవచ్చనే భావనను సృష్టించారని, ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారమని కెంట్ తెలిపారు. ఇదే విధానాన్ని గతంలో ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఉపయోగించారని ఆయన ఆరోపించారు.ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వడం తన వల్ల కాదని, అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని యుద్ధంలో మరిన్ని ప్రాణాలను పణంగా పెట్టడాన్ని సమర్థించలేనని ఆయన స్పష్టం చేశారు.