|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 07:18 PM
తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇక నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఈ వార్తలు తప్పు అని పేర్కొంటూ.. అధికార డీఎంకే.. కాంగ్రెస్ పార్టీ పొత్తులు ఖరారు కావడంతో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక టీవీకే చీఫ్ విజయ్.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. త్వరలోనే టీవీకే, ఎన్డీఏతో జట్టుకట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. తాజాగా విజయ్ పార్టీ క్లారిటీ ఇచ్చింది.
ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయ్ నేతృత్వంలోని టీవీకే శనివారం స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఎన్డీఏ, టీవీకే పొత్తుపై వస్తున్న వార్తలన్నీ కేవలం మీడియా ఊహాగానాలేనని కొట్టిపారేసింది. ఎన్డీఏతో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయనే వార్తలను టీవీకే పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్.. వదంతులు అని కొట్టిపారేశారు. శుక్రవారం రోజున టీవీకే పార్టీ జిల్లా కార్యదర్శులతో జరిగిన వర్చువల్ సమావేశం.. కేవలం పార్టీ బలాబలాలు, పొత్తు అవకాశాలను అంచనా వేయడానికేనని ఆయన స్పష్టం చేశారు.
ఎన్డీఏ కూటమితో పొత్తుకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. టీవీకే పార్టీకి బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని తాము ఇప్పటికే స్పష్టం చేశామని నిర్మల్ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా.. ఒకవేళ టీవీకే, ఎన్డీఏ కూటమి మధ్య పొత్తుకు సంబంధించి ఊహాగానాలు నిజం అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌ని బీజేపీ అంగీకరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
ఇక.. టీవీకే పార్టీతో ఎన్డీఏ కూటమి పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తులపై నేరుగా సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు. మీడియా మొత్తం పొత్తుల గురించి ఆందోళన చెందుతోందని.. కానీ తాము మాత్రం తమిళనాడు ప్రజల సమస్యలు, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, మహిళల రక్షణ గురించి ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు.
Latest News