|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:42 PM
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని వైయస్ఆర్‌సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మత్స్యకారుల సంక్షేమం కోసం వైయస్ జగన్ నిర్మించిన ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటు పరంచేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, ఆసుపత్రులు, చివరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని, ఇప్పుడు మత్స్యకారుల జీవనాధారమైన హార్బర్ల మీద కన్నేశారని ధ్వజమెత్తారు. జువ్వలదిన్నె హార్బర్‌ను తక్షణమే మత్స్యకారులకు అప్పగించాలని, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మత్స్యకారులను సంఘటితం చేసి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
Latest News