|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 09:14 PM
అసోంలోని కోక్రఝార్ (కామాఖ్య) నుంచి తెలంగాణలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు నడిచే కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇవాళ ప్రారంభమైంది.అసోంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రయాణించనుంది. దీని ద్వారా దేశ తూర్పు రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం కోక్రఝార్–చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఒక్క దిశలో మాత్రమే నడుపుతున్నారు. త్వరలోనే రెండు వైపులా సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇవాళ అసోంలోని కోక్రఝార్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరిన ఈ రైలు, రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలాస స్టేషన్‌కు చేరుకోనుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం రోడ్, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణించి ఎల్లుండి ఆదివారం ఉదయం 8:30 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుతుంది.ఈ ప్రయాణం మొత్తం దాదాపు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రారంభ దశలో ఈ రైలును ప్రయోగాత్మకంగా నడిపి, ఏర్పడే లోటుపాట్లను పరిశీలించిన తర్వాత పూర్తి షెడ్యూల్ ప్రకటించనున్నారు. అప్పటివరకు వన్‌వే సర్వీసుగానే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.ఐదు రాష్ట్రాల మీదుగా సాగే ఈ దీర్ఘ ప్రయాణం ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుందని రైల్వే శాఖ పేర్కొంది. ఈ రైలును ప్రారంభించిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేశారు.
Latest News