|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 07:16 PM
గల్ఫ్ తీరంలోని అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడిచేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. తమ దాడితో నౌక దెబ్బతిందని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ఐఆర్జీసీ నేవీ పేర్కొంది. అయితే, ఈ వాదనను అమెరికా తోసిపుచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి తమ విమాన వాహక నౌక మద్దతు ఇస్తూనే ఉందని పేర్కొంది. విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌కు సమీపంగా వచ్చిన ఇరాన్ నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపినట్టు అగ్రరాజ్యం మీడియా నివేదించింది. గత రెండు వారాలుగా పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
అధునాతన క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఖచ్చితమైన ఆపరేషన్.. ఒమన్ సముద్రంలో ఇరాన్ సరిహద్దుల నుంచి దాదాపు 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను ఢీకొట్టిందని ఇరాన్ పవిత్ర ప్రవక్త (పీబీయూహెచ్) కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా నౌకపై దాడి తర్వాత.. నౌకలోని ఇరానియన్ బృందం అత్యంత వేగంగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవడం కనిపించిందని ఇరాన్ అధికారిక టీవీ నివేదించింది.
దీనికి మించిన ఎటువంటి వివరాలను మాత్రం ప్రభుత్వ టెలివిజన్ తెలియజేయలేదు. గతంలో లింకన్‌ను ఢీకొట్టినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాలు ప్రకటించాయి. కానీ ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తమ నౌక దగ్గరగా కూడా రాలేదని పెంటగాన్ ప్రకటించింది.
అబ్రహాం లింకన్ నౌకపై దాడి చేశామనే ఇరాన్ నివేదికలపై స్పందించిన అమెరికా.. వాటిని తోసిపుచ్చింది. అమెరికా సెంట్రల కమాండ్ నౌక ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘అబ్రహం లింకన్ విమాన వాహక నౌక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి మద్దతు కొనసాగుతుంది’’ అని తెలిపింది. సీబీఎస్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఓ అమెరికా నేవీ నౌక డిస్ట్రాయర్లు, క్రూయిజర్ల ముందు డెక్‌కు అమర్చిన పూర్తిగా ఆటోమేటెడ్ నావెల్ ఫిరంగి 54-క్యాలిబర్ మార్క్ 45 తుపాకీని ఉపయోగించి ఇరాన్ నౌకపై కాల్పులు జరపడానికి ప్రయత్నించింది అని పేర్కొంది.
అయితే, ఇరాన్ నౌకపై కాల్పులు జరిపింది ఏ నౌక అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ, దాడుల నుంచి ఇరాన్ నౌక తప్పించుకున్నట్టు అమెరికా అధికారుల వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీబీఎస్ నివేదించింది. ఈ సంఘటన వారం ప్రారంభంలో జరిగినట్టు తెలిపింది. ఇరాన్‌పై దాడులు ప్రారంభానికి ముందే అమెరికా రెండు విమాన వాహక నౌకలను యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను పశ్చిమాసియాకు పంపింది. యుఎస్ఎస్ స్ప్రూయెన్స్, యుఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ అనే మరో రెండు ఇతర యుద్ధనౌకలను మద్దతుగా పంపింది. గత వారం నాటికి మరో ఆరు గైడెడ్-క్షిపణి డిస్ట్రాయర్లు కూడా అరేబియా సముద్రంలో ఉన్నాయి.
Latest News