|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 06:34 PM
అమెరికా వైమానిక దళానికి చెందిన రీ-ఫ్యూయలింగ్ విమానం ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది మృతిచెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ శుక్రవారం మధ్యాహ్నం ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపింది. ఉత్తర ఇరాక్‌లో గురువారం రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ట్యాంకర్ కూలిపోయిందని వెల్లడించింది. రెండు సైనిక ట్యాంకర్ విమానాలు ల్యాండ్ అవుతున్న సమయంలో దుర్ఘటన చోటుచేసుకుందని చెప్పింది. మరో విమానం సురక్షితంగా దిగినట్లు పేర్కొంది. శత్రువు దాడి వల్ల లేదా ఫ్రెండ్లీ ఫైర్ కారణమా? అనేది తెలుసుకోడానికి దర్యాప్తు కొనసాగుతుందని సెంట్‌కామ్ ప్రకటించింది. అమెరికాకు చెందిన అత్యంత భారీ విమాన వాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌పై దాడిచేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ తరుణంలోనే అమెరికా రీ- ఫ్యూయలింగ్ విమానం కూలిపోవడం గమనార్హం.
కాగా, తామే అమెరికా రీ-ఫ్యూయల్ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్‌కు అనుకూలంగా పనిచేసే ఇరాక్‌కు చెందిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో పేర్కొంది. దాడిలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కానీ, అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిని తోసిపుచ్చింది. ఇరాన్‌తో యుద్ధంలో విమానాలకు గాల్లోనే ఇంధనం నింపడం అత్యంత సవాల్‌తో కూడుకున్నది. వందలాది అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడుల్లో పాల్గొనడం వల్ల రీఫ్యూయలింగ్ ట్యాంకర్ విమానాల అవసరం పెరిగింది.
ఇదిలా ఉండగా ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా ఇప్పటి వరకు నాలుగు సైనిక విమానాలను కోల్పోయింది. మార్చి 2న పొరపాటున ఎఫ్-15ఈ యుద్ధ విమానాలను ఫ్రెండ్లీ ఫైట్‌లో కువైట్ ఎఫ్-18 కూల్చేసింది. కువైట్ యుద్ద విమానం పైలట్.. మూడు క్షిపణులతో వాటిని కూల్చివేసినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్‌తో అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
1950, 60ల ప్రారంభంలో బోయింగ్ తయారు చేసిన KC-135 అమెరికా వైమానిక దళం రీఫ్యూయలింగ్ ఫ్లీట్‌లో కీలక భాగం. దీర్ఘ-శ్రేణి పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. 60 ఏళ్లుగా ఆపరేషన్‌లో ఉన్న KC-135 స్ట్రాటోట్యాంకర్‌లో పైలట్, కో-పైలట్, ఆపరేటర్, నేవిగేటర్, మిషన్ ఆధారంగా అదనపు సిబ్బందిని ఉంటారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న దాడులతో ప్రారంభమైన యుద్ధం.. గల్ఫ్ దేశాలకు విస్తరించింది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను మాత్రమే కాకుండా సౌదీ అరేబియా, యూఏఈలోని పౌర, చమురు మౌలిక సదుపాయాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దిగ్బంధించిన తర్వాత ఇంధన కొరత భయాలను రేకెత్తించింది.
Latest News