|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 06:30 PM
దేశవ్యాప్తంగా ఉచిత హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌తో పాటు కొన్ని రకాల కేన్సర్లను నిరోధించే లక్ష్యంతో కేంద్రం ఉచిత టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 14 ఏళ్లు నిండిన బాలికలకు ‘గార్డాసిల్’ అనే టీకాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందజేస్తున్నారు. హెచ్‌పీవీ టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణ వ్యూహంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు కేంద్రం ఈ టీకాను ప్రారంభించింది. ఏటా 1.15 కోట్ల టీకాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
హెచ్‌పీవీ టీకా పలు క్లినికల్ ట్రయల్స్ తర్వాత 2006లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోస్‌లను పంపిణీ చేశారు. దీంతో పలు దేశాల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్లు తగ్గినట్లు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం అమలవుతోంది. వీటిలో 90 దేశాలు సింగిల్ డోస్‌లను అందిస్తున్నాయి. ప్రపంచ కేన్సర్ బాధితుల్లో చైనా, అమెరికా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 2040 నాటికి భారత్‌లో కేన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలు పెరిగే అవకాశం ఉందని అంచనా. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 2 కోట్ల మంది ఈ భూతం బారిన పడుతుండగా.. వీరిలో 15 లక్షల మంది భారతీయులే.
ఒక డోసు వేయించుకుంటే దీర్ఘకాల రక్షణ లభిస్తుందని పలు శాస్త్రీయ పరిశోధనల్లో నిర్దారణ అయ్యింది. జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను స్వచ్ఛందంగా, ఉచితంగా ఇస్తున్నారు. దేశంలో బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాను అందజేసిన తొలి రాష్ట్రం తమిళనాడు. మహిళలకు ఎక్కువగా నిర్దారణ అయ్యే కేన్సర్లలో గర్బాశయ ముఖద్వార కేన్సర్ ముఖ్యమైంది. అవగాహన, టీకా ద్వారా దీనిని నిరోధించవచ్చు. దీనిని 2030 నాటికి నిర్మూలించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టుకుంది.
Latest News