|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 06:29 PM
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం జనం ఎంతకైనా తెగిస్తున్నారు. వ్యూస్, లైక్స్, షేర్ల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలను కూడా ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారు. అచ్చంగా ఇలాంటి ఘననే జరిగింది మధ్య ప్రదేశ్‌లో. ఓ మహిళ తన నెలల వయసున్న బిడ్డను స్కూటీ స్టోరేజీ డిక్కీలో పెట్టింది. ఆపై దాని మూత వేసి దానిపైనే కూర్చొని బండిని నడిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కావాలనే రీల్స్ పిచ్చితోనే ఆమె ఈ వీడియో చేసిందా లేక తెలియక ఇలా చేసిందా అనేది మాత్రం తెలియడం లేదు.
వైరల్ అవుతున్న క్లిప్‌లో.. ఒక మహిళ తన పసికందును స్కూటర్ సీటు కింద అత్యంత జాగ్రత్తగా పడుకోబెడుతుంది. ఆ తర్వాత బిడ్డ లోపల ఉండగానే సీటును లాక్ చేసి.. ఏమీ ఎరగనట్లు వాహనం ఎక్కి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆపై కాసేపటికే గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత బండిని ఆపి.. బిడ్డను బయటకు తీస్తుంది. అయితే ఈ దృశ్యం చూసిన వారు ఆశ్చర్యంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇరుకైన ప్రదేశంలో బిడ్డకు ఊపిరి ఆడుతుందా? పొరపాటున స్కూటర్ బ్రేక్ వేస్తే ఆ చిన్నారి పరిస్థితి ఏంటి? అని వేల సంఖ్యలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఇది కావాలని చేసిన వీడియో అని కొందరు వాదిస్తుండగా.. కాదు బిడ్డను చూస్కునే వారు, ఎత్తుకునే వారు ఎవరూ లేకే ఆమె అలా చేయాల్సి వచ్చిందేమోనని మరికొందరు వాదిస్తున్నారు. ముఖ్యంగా "ఇది పక్కాగా వ్యూస్ కోసం చేసిన 'రీల్'. వీడియో ఎడిటింగ్‌లో మహిళ స్కూటర్ ఎక్కే ముందు ఒక చిన్న కట్ ఉంది. కచ్చితంగా షూటింగ్ కోసమే ఇలా చేసి ఉంటారు" అని కొందరు నెటిజెన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే "ఇది అమానవీయం. ఆఫీసుకో లేదా కూలి పనికో వెళ్లే సమయంలో బిడ్డను ఎక్కడ ఉంచాలో తెలియక ఇలాంటి సాహసాలు చేసి ఉండవచ్చు. విమర్శించే ముందు మన దేశంలో తల్లులకు ఉన్న రక్షణ, రవాణా సౌకర్యాల గురించి ఆలోచించండి" అంటూ మరికొందరు వాదిస్తున్నారు.
అధికారుల స్పందన కోరుతున్న జనం
ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనేది స్పష్టంగా తెలియనప్పటికీ.. సదరు మహిళ నడిపిన బండి నెంబర్ ప్లేటుపై ఎంపీ ఉండడం చూసి.. అది కచ్చితంగా మధ్య ప్రదేశ్‌కు చెందినదే అనుకుంటున్నారు. ఈక్రమంలోనే మధ్యప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన చర్యలను ప్రోత్సహించే వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని, సదరు మహిళను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Latest News