|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 07:18 PM
పశ్చిమాసియాలో యుద్ధం పరాకాష్టకు చేరుతున్న వేళ భారత ప్రభుత్వం తన పౌరుల రక్షణ కోసం కీలక అడుగులు వేస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం గల్ఫ్ దేశాలపై పడుతుండటంతో లెబనాన్, ఖతార్ దేశాల నుంచి వందలాది మంది భారతీయులను స్వదేశానికి చేర్చే ప్రక్రియను వేగవంతం చేసింది. బుధవారం ఒక్కరోజే సుమారు 700 మందికి పైగా భారతీయులు క్షేమంగా సొంత గడ్డపై చేర్చింది.
లెబనాన్ నుంచి తొలి విడత తరలింపు
లెబనాన్ రాజధాని బీరూట్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న 177 మంది భారతీయ పౌరులను ఒక ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా ఢిల్లీకి తరలించారు. వీరిని వారి యాజమాన్యం ఏర్పాటు చేసిన విమానంలో స్వదేశానికి పంపగా.. బీరూట్ విమానాశ్రయంలో భారత రాయబారి నూర్ రెహమాన్ షేక్ స్వయంగా వీరికి వీడ్కోలు పలికారు. లెబనాన్‌లోని భారతీయులకు అన్ని విధాలా అండగా ఉంటామని రాయబార కార్యాలయం ప్రకటించింది.
మరోవైపు ఖతార్‌లో చిక్కుకున్న సుమారు 500 మంది భారతీయులు బుధవారం ఖతార్ ఎయిర్‌వేస్ విమానాల ద్వారా ఢిల్లీ, ముంబైలకు చేరుకున్నారు.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మార్చి 12వ తేదీన మరిన్ని అదనపు విమానాలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రాయబార కార్యాలయం 24/7 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కేవలం ఒకటి రెండు రోజుల్లోనే 'తత్కాల్' పాస్‌పోర్టులను జారీ చేస్తూ సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఖతార్ నుంచి వీరిని రోడ్డు మార్గం ద్వారా సౌదీకి తరలించి అక్కడి నుంచి భారత్‌కు విమానాల్లో తరలిస్తున్నారు.
గాలిలో యుద్ధ భయం ఉంటే.. సముద్ర మార్గంలో క్షిపణి దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. యూఏఈ నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తున్న మయూరీ నారీ అనే థాయ్‌లాండ్ సరకు రవాణా నౌకపై హార్ముజ్ జలసంధిలో దాడి జరిగింది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పౌర విమానయానం,వాణిజ్య నౌకలపై దాడులు చేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, ఇది ప్రపంచ వాణిజ్యానికే ముప్పు అని భారత్ హెచ్చరించింది. ప్రస్తుతానికి పశ్చిమాసియాలోని భారతీయులు అపరిచిత వస్తువులకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని భారత ప్రభుత్వం సూచించింది.
Latest News