|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:29 PM
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కావూరి మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు సంతాపాన్ని తెలియజేశారు.
'సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు గారి మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు గారి మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరి గారిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. సాంబశివరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను' అంటూ చంద్రబాబు సంతపాన్ని తెలిపారు.
'కేంద్ర మాజీమంత్రి, రాజకీయ కురువృద్ధులు, మా బంధువు కావూరి సాంబశివరావు గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. కావూరి గారి సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
కావూరి సాంబశివరావు 1943 అక్టోబర్ 1వ తేదీన జన్మించారు.. వరంగల్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అటు వ్యాపార రంగంలో ఇటు రాజకీయాల్లో రాణించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కావూరి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు.. 1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఏలూరు నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. అంతేకాదు 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పని చేశారు.
2014లో ఆంధ్రప్రదేశ్ విభజనకు నిరసనగా కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం తర్వాత బీజేపీలో చేరారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. కావూరి సాంబశివరావుకు ముగ్గురు సంతానం.. ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ కావూరి సాంబశివరావు కుమార్తె తనయుడు.
Latest News