ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై,,, టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:21 PM

ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా ఏర్పడి 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన టీడీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే 2014 ఫిబ్రవరి 14వ తేదీని బ్లాక్ డేగా ఎంపీ లావు అభివర్ణించడంపై.. బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో ఎట్టకేలకు ఆయన స్పందించారు.


పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా స్పందించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌.. ఏపీ ఎంపీలు తెలంగాణపై ఏడుపు ఆపాలని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణపై ఏపీ నేతలు విషం చిమ్మడం మాత్రం ఆపడం లేదని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని లోక్‌సభ వేదికగా కించపరిచేలా ఎంపీ లావు మాట్లాడారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏం కావాలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అడిగే తెలివి లేక.. తెలంగాణపై పడి ఏడవడం వారికి అలవాటుగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా తెలంగాణ జోలికి వచ్చి తమ ప్రజలను అవమానించినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించ పరిచే విధంగా మాట్లాడితే మాత్రం తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇక తెలంగాణపై తాను చేసిన వ్యాఖ్యలు ఇంతటి వివాదానికి కారణం కావడంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఎంపీ లావు.. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా కూడా ఏం మాటలు మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో అప్పటి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరా కుమార్ తీరుపై మాత్రమే తాను మాట్లాడినట్లు చెప్పారు. ఆ సమయంలో లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ రూల్స్ అతిక్రమించేలా వ్యవహరించారని మాత్రమే తాను పేర్కొన్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి.. మళ్లీ తెలంగాణ, ఏపీ సెంటిమెంట్‌ను రాజేయవద్దని బీఆర్ఎస్ నేతలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.

Latest News
Bengal election this time is vote against infiltration, corruption, crimes against women: Amit Shah Wed, Apr 22, 2026, 03:56 PM
PCB to investigate Nawaz after positive test for recreational drug: Report Wed, Apr 22, 2026, 03:54 PM
Nepal Home Minister resigns following controversy over financial dealings Wed, Apr 22, 2026, 03:54 PM
From Puttingal to Thrissur, a recurring cycle of fireworks tragedies in Kerala Wed, Apr 22, 2026, 03:25 PM
Nearly 70 pc of new green jobs need tech skills; huge vacancy for skilled professionals Wed, Apr 22, 2026, 03:17 PM