|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:27 AM
తిరుమల శ్రీవారి దర్శనానంతరం భక్తులు పవిత్రంగా భావించి కొనుగోలు చేసే బంగారు, వెండి డాలర్లను ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి పోస్టల్ సర్వీస్ ద్వారా వాటిని నేరుగా ఇంటికే పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఇటీవల టీటీడీ ఆదాయం పెంచే మార్గాలపై అధ్యయనం కోసం ఓ ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శ్రీవారి డాలర్ల విక్రయాలను మరింత పెంచాలని, వాటిని ఆన్‌లైన్‌లో కూడా విక్రయించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం తిరుమలలోని కౌంటర్లలో విక్రయిస్తున్న బంగారు, వెండి డాలర్లు, పెండెంట్లతో పాటు కొత్తగా నాణేలను కూడా ఆన్‌లైన్‌లో అమ్మనున్నారు. అంతేకాకుండా, ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్యులను దృష్టిలో ఉంచుకుని, వెండి డాలర్లకు బంగారు పూత పూసి తక్కువ ధరకే విక్రయించాలని కమిటీ ప్రతిపాదించింది. డాలర్లను మరింత ఆకర్షణీయమైన డిజైన్లలో తయారు చేయాలని కూడా నిర్ణయించారు.
Latest News