|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:37 PM
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ -ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు గానూ టీమ్ ఆఫ్ ది టోర్నీ జట్టును సోమవారం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్.. న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఫైనల్ జరిగిన ఒక రోజు తర్వాత.. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన 11 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఇందులో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా నుంచి నలుగురికి చోటు దక్కింది. ఈ జట్టుకు సౌతాఫ్రికాకు చెందిన ఎయిడెన్ మార్‌క్రమ్ సారథిగా ఎంపికయ్యాడు.
ఐసీసీ ప్రకటించిన జట్టులో భారత్ నుంచి.. సంజూ శాంసన్ , ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాలకు చోటు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్.. ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 321 పరుగులు చేశాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో హాఫ్ సెంచరీ స్కోరు చేశాడు.
ఇక వన్ డౌన్ బ్యాటర్.. ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో పరుగుల వరద పారించాడు. 190కి పైగా స్ట్రైక్ రేటుతో అతడు 317 రన్స్ స్కోరు చేశాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్.. హాఫ్ సెంచరీ సైతం చేశాడు. మరోవైపు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ టోర్నీలో రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు.. 9 వికెట్లు తీశాడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా .. సత్తాచాటాడు. 8 మ్యాచ్‌లలో 6.21 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఫైనల్‌లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టీ20 ప్రపంచకప్ 2026..
ఎయిడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సాహిబ్‌జాదా ఫర్హాన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, జేసన్ హోల్డర్, జస్‌ప్రీత్ బుమ్రా, లుంగీ ఎంగిడి, ఆదిల్ రషీద్, బ్లెస్సింగ్ ముజరబానీ.
12వ ఆటగాడిగా అమెరికాకు చెందిన వాన్ చాక్‌విక్‌ను ఐసీసీ ఎంపిక చేసింది.
Latest News