|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:35 PM
టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతాడనే ప్రచారం జరిగింది. మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా.. 35 ఏళ్ల సూర్య రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. జై షా చేతుల మీదుగా సూర్యకుమార్ యాదవ్.. టీ20 ప్రపంచకప్ టైటిల్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. తన తర్వాతి టార్గెట్ ఏంటో చెప్పాడు. రెండేళ్ల తర్వాత జరిగే లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. దీంతో పరోక్షంగా రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు.
మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "మా తదుపరి లక్ష్యం ఒలింపిక్ స్వర్ణం. 2028లో లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌లో స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ 2028 కూడా జరగనుంది. అందులోనూ సత్తాచాటుతాం" అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన కామెంట్స్‌తో రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టాడు సూర్యకుమార్ యాదవ్. తాను మరో రెండేళ్ల పాటు భారత జట్టు తరఫున ఆడతానని చెప్పకనే చెప్పాడు.
ఇక లాస్ ఎంజెలెస్ 2028 ఒలింపిక్స్ ద్వారా.. సుమారు 128 ఏళ్ల విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ అడుగుపెట్టనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో జరగనుంది. క్రికెట్ పోటీలు.. 2028 జులై 12 నుంచి అంటే.. ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి ప్రారంభం కానున్నాయి. పోటీలు జులై 29న ముగియనున్నాయి.
ఒలింపిక్స్‌లోని అన్ని మ్యాచ్‌లూ కూడా లాస్ ఏంజెలెస్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి. ఈ ఒలింపిక్స్‌లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు ఒలింపిక్స్‌లో పోటీ పడతాయి. స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఆరు జట్లు పోటీ పడనున్నాయి.
Latest News