|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:53 PM
ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే.. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తాడేపల్లి రిటైనింగ్ వాల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నారు.. ఏడాది కాలంలోనే ఈ పనులకు సంబంధించి పరిపాలన అనుమతులు తీసుకొచ్చారు మంత్రి లోకేష్.. టెండర్ ప్రక్రియను కూడా పూర్తిచేశారు.. ఇవాళ శంకుస్థాపన పూర్తి చేశారు. ఈ రిటైనింగ్ వాల్‌ను భవిష్యత్‌లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా నిర్మిస్తారు. కృష్ణా నదిలో 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా రిటైనింగ్ వాల్‌ను ప్లాన్ చేశారు.
ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీ వరకు కృష్ణా నది కుడివైపు వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఈ రిటైనింగ్ వాల్‌ను కేవలం మామూలు గోడగా నిర్మించడం లేదు.. అక్కడ భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి.. పైల్- రాఫ్ట్ సాంకేతికతతో నిర్మిస్తారు. నీళ్ల ఉధృతితో పాటుగా భూకంపాలను సైతం తట్టుకునెలా ఈ గోడను నిర్మించనున్నారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే తాడేపల్లి సమీపంలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీతో పాటూ పలు లోతట్టు ప్రాంతాలవారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ రిటైనింగ్ వాల్‌తో దాదాపు 50వేల మంది ప్రజలు వరద ప్రభావం లేకుండా ఇబ్బందులు తొలగిపోయాయి. అంతేకాదు ఈ రిటైనింగ్ వాల్ అమరావతిలోని పలు ప్రాంతాలు, నేషనల్ హైవే 65కు కూడా రక్షణగా నిలవనుంది.
అలాగే మంగళగిరి నియోజకవర్గం నులకపేటలో కమ్యూనిటీ హాల్‌ను కూడా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తాడేపల్లిలోని నులకపేటలో కమ్యూనిటీ హాల్‌ను నూతనంగా నిర్మించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్‌ను నిర్మించారు. వీటితో పాటుగా మంగళగిరి నియోజకవర్గంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు.
Latest News