|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:26 PM
తమ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీకి మద్దతుగా సోమవారం వేలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లోని సెంట్రల్ స్క్వేర్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు.. కొత్త సుప్రీం లీడర్‌కు విధేయులమైన ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇదే సమయంలో ఇరాన్‌పై విస్తృత దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ‘‘టెహ్రాన్, ఇస్ఫాహన్‌తో పాటు దక్షిణ ఇరాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా ఉగ్రవాద ఇరాన్ పాలనలోని మౌలిక వసతులపై విస్తృత స్థాయిలో దాడులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఓప్రకటన విడుదల చేసింది. ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం మరో మలుపు తీసుకుంది.
ఇజ్రాయెల్ తన యుద్ధ ప్రణాళికలను ప్రకటించగానే.. టెహ్రాన్‌లోని ఇంగెలాబ్ స్క్వేర్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన జనం.. కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ , ఆయన తండ్రి దివంగత ఆయతుల్లా అలీ ఖమేనీ ఫోటోలు, ఇరాన్ జెండాలను ప్రదర్శించారు.
తమ సుప్రీం నేతగా మోజ్తాబా పేరు ఇరాన్ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇజ్రాయెల్- అమెరికా వైమానిక దాడుల నడుమే సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అసెంబ్లీ ఎక్స్‌పర్ట్స్ కౌన్సిల్ రహస్యంగా సమావేశమై.. మోజ్తాబాను పేరును ఖరారు చేసింది. మోజ్తాబాకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎటువంటి రాజకీయ పదవిని చేపట్టకపోయినా ఇరాన్ రాజకీయాల్లో తెరవెనుక ప్రభావం చూపారు.
అమెరికా, ఇజ్రాయెల్‌లు వారం రోజులకు పైగా భారీ బాంబు దాడుల తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఈ నియామకాన్ని దేశ ఉనికి కోసం పోరాటంగా అభివర్ణించిన ఇరాన్ నాయకత్వం.. లొంగిపోయే ప్రసక్తేలేదని సంకేతాలు బలంగా పంపింది. ఈ ప్రకటన అనంతరం ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ ముడి చమురు సోమవారం బ్యారెల్‌కు ఒక దశలో 120 డాలర్లకు చేరి.. తర్వాత 110 డాలర్లకు దిగి వచ్చింది. ప్రస్తుత యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు 65 శాతం పెరుగుదల నమోదయ్యింది.
ఇస్ఫాహన్‌లోని రివల్యూషనరీ గార్డ్స్, దాని అనుబంధ వాలంటరీ దళం బసీజ్ ఫోర్సెస్స్ రాకెంట్ ఇంజిన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, మిస్సైల్ లాంచ్ కేంద్రాలు సహా కమాండ్ సెంట్లరపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక, యుద్ధం మొదలైన తర్వాత మోజ్తాబా ఖమేనీ బయట ప్రపంచానికి కనిపించలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడానికి ముందు నుంచే సుప్రీం లీడర్‌గా మోజ్తాబా పేరు వినిపిస్తోంది. 1979 ఇస్లామిక్ విప్లవాన్ని రాచరికంతో పోల్చిన కొందరు ఇరాన్ రాజకీయ ప్రముఖులు.. వారసత్వంగా సుప్రీం నేత పదవి చేపట్టడాన్ని విమర్శించారు. అయినప్పటికీ నిపుణుల అసెంబ్లీ వంశపారంపర్య నాయకత్వానికే ఓటు వేసింది.
Latest News