పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:13 PM

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులపై పార్లమెంట్‌లో కేంద్రం సోమవారం కీలక ప్రకటన చేసింది. రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో పరిణామాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. అక్కడ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. చర్చలు, దౌత్యపరమైన చర్యలే ఇటువంటి పరిస్థితులకు పరిష్కారమని, భారత్ పదే పదే ఇదే చెబుతుందని జై శంకర్ ఉద్ఘాటించారు.


‘‘ఉద్రిక్తతలు, సంక్షోభ సమయంలో దౌత్యమార్గాలు, చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 20న ఓ ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులు మన అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి.. ఎప్పటికప్పుడు వాటిపై ప్రధాని సమీక్ష జరుపుతున్నారు.. దాడుల్లో ఇరాన్ కీలక నేతలు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు.. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు భారత వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. మనదేశ ఇంధన భద్రతకు గల్ఫ్ దేశాలు ఎంతో కీలకం... మన దేశీయ అవసరాలకు కావాల్సిన చమురు, గ్యాస్ అక్కడ నుంచే వస్తోంది. అంతేకాదు, గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. మా ఆందోళన అంతా వారి గురించే.. అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం... దేశ ప్రజల ప్రయోజనాలకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుంది. దీనికి అవసరమైనచోట మన ఆయిల్ కంపెనీల ప్రయత్నాలకు దౌత్యమార్గాల్లో మద్దతు ఇచ్చాం’’ అని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.


గత పది రోజులుగా ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య దాడులతో పశ్చిమాసియా రగులుతోంది. సౌదీ, యూఏఈ, కువైట్ సహా గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద పేలుళ్లు ఘటనలతో విమానాలు నిలిచిపోయి.. వేలాది మంది భారతీయులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతోంది.


గత నెల తూర్పు నౌకాదళ కేంద్రం విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ 2026‌లో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్తోన్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డెనాపై జలాంతర్గమితో అమెరికా దాడిచేసి ముంచేసిన సంగతి తెలిసిందే. మరో యుద్ధ నౌక ఐరిస్ లావన్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇరాన్ అభ్యర్థన మేరకు దానికి భారత్ ఆశ్రయం కల్పించింది. కొచ్చి పోర్టులో ఆ నౌకను నిలిపేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై కూడా రాజ్యసభలో జైశంకర్ మాట్లాడారు. ‘‘ఇటువంటి క్లిష్ట సమయంలో ఇరాన్‌తో సంప్రదింపులు జరపడం కష్టంగా ఉంది... యుద్ధనౌకకు ఆశ్రయం ఇచ్చినందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది’’ అని విదేశాంగ మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ ఇబ్బందులు ఉన్నా.. మానవతా దృక్పథంతోనే డ్యాకింగ్‌ను అనుమతి ఇచ్చినట్టు గతంలోనే జైశంకర్ చెప్పారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM