|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 06:30 PM
నటుడు శివాజీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
అడ్డుకునేందుకు కొంతమంది కుట్రపన్నారని ఆరోపించారు. తాను అసలు రాజకీయాల గురించి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నానని.. అయినా సరే తన సినిమాపై జగన్ పేటీఎం బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. 'జగన్ గారు నా జోలికి రావొద్దు' అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తన సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ రివ్యూలు రాయించారని శివాజీ మండిపడ్డారు. తన సినిమాను ఆపగలరేమో.. కానీ తనను మాత్రం ఆపలేరన్నారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే తనను ఏమీ చేయలేకపోయారని.. ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.సీబీఐ కేసులున్న నేతల్ని రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరతానన్నారు శివాజీ. రాజకీయ నేతలపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని.. అప్పుడే సీబీఐ వంటి సంస్థలపై నమ్మకం కలుగుతుందన్నారు.
తాను రాజకీయాలు వద్దుకుని ఏమీ మాట్లాడటం లేదన్నారు నటుడు శివాజీ. కానీ అమరావతి విషయంలో మాత్రం తన వాయిస్‌ను వినిపిస్తానన్నారు. రాజధాని రైతుల కోసం ఎవరిపైనైనా పోరాడతానన్నారు. తానను ఎవరికి భయపడేది లేదని.. నిజాయితీగా బతుకుతున్నానని, తనను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను జనం కోసం బతుకుతానని.. ఎవరో ఇచ్చే డబ్బుల కోసం బతికేవాడిని కాదన్నారు. కనీసం 100మంది సబ్‌స్క్రైబర్లు లేని కొందరు తన సినిమాపై ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని నెగిటివ్ రివ్యూలు రాసినా.. తన సినిమా వారం తర్వాతైనా కచ్చితంగా ప్రజలకు దగ్గరవుతుందన్నారు.
శివాజీ నటించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై పనిగట్టుకుని కొందరు నెగిటివ్ రివ్యూలు రాయిస్తున్నారని శివాజీ అంటున్నారు. దీని వెనుక వైఎస్సార్‌సీపీ కుట్ర ఉందని శివాజీ ఆరోపిస్తున్నారు. అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా శివాజీ ఓ వీడియోను విడుదల చేశారు.
Latest News