నీటి బెలూన్‌ కారణంగా యువకుడిని రాడ్లు, కత్తులతో హతమార్చిన వ్యక్తులు, 8 మంది అరెస్ట్
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 06:26 PM

ఇటీవల దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగులు చల్లుకుంటూ, డ్యాన్స్‌లు చేసుకుంటూ వివిధ నగరాల్లో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జరిగిన హోలీ వేడుకలు ఒక యువకుడి ప్రాణాలు తీశాయి. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో హోలీ సందర్భంగా చిన్న పిల్లలు ఆడుకుంటుండగా.. తలెత్తిన వివాదం కాస్తా.. పెద్ద వాళ్ల వరకు వచ్చింది. హోలీ ఆడుతుండగా.. ఓ చిన్నారి విసిరిన ఒక నీటి బెలూన్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ ఘర్షణలో ఒక యువకుడి ప్రాణం పోవడం తీవ్ర దుమారం రేపింది. 26 ఏళ్ల తరుణ్ బుటోలియా అనే వ్యక్తిపై కొంతమంది మూక దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


మార్చి 4వ తేదీన హోలీ సందర్భంగా తరుణ్ బుటోలియా కుటుంబంలోని 11 ఏళ్ల బాలిక తన ఇంటి పైకప్పు మీద హోలీ ఆడుతోంది. అయితే పొరపాటున ఆమె విసిరిన ఒక చిన్న నీటి బెలూన్.. ఇంటి పక్కన ఉన్న మరో కుటుంబానికి చెందిన మహిళపై పడింది. దీంతో ఆ మహిళపై రంగు నీళ్ల పడ్డాయి. దీంతో తరుణ్ కుటుంబం ఆ మహిళకు వెంటనే క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ఊరుకోని ఆ మహిళ.. తన బంధువులకు ఫోన్ చేసి మరీ పిలిపించింది. ఈ క్రమంలోనే చిన్న వివాదం కాస్తా ముదిరి పెద్దది అయింది.


 అయితే ఈ ఘటన జరిగిన సమయంలో.. తరుణ్ బుటోలియా ఒక హోలీ పార్టీ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతని తల్లిదండ్రులపై దాడి జరుగుతోందని ఇరుగు పొరుగు వాళ్లు తరుణ్ బుటోలియాకు ఫోన్ చేయడంతో.. ఉన్నఫలంగా ఆ యువకుడు ఆగమేఘాల మీద తన బైక్‌పై ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వేచి చూస్తున్న కొంతమంది వ్యక్తులు అతనిపై దాడి చేసేందుకు రెడీ అయ్యారు.


ఈ ఘటనను గుర్తు చేసుకున్న తరుణ్ బుటోలియా తల్లి సునీత బుటోలియా కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ మూక దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇంటి లోపల తలుపులు వేసుకుని ఉన్నామని.. అయితే కొంతమంది కావాలనే తమ కుమారుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి దాడి చేశారని తెలిపింది. అసలు ఆ గొడవకు, తమ కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని వివరించింది. ఆ మూక ఇనుప రాడ్లు, హాకీ స్టిక్‌లతో తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.


ఆ మూక తరుణ్ బుటోలియాపై దాడి చేస్తుండగా.. స్థానికులు, మహిళలు ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ మూక వారి మాటలు పట్టించుకోలేదు. జిమ్ చేసే అలవాటు ఉన్న తరుణ్.. ఆ మూక నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఒకేసారి 7 నుంచి 8 మంది వ్యక్తులు దాడి చేయడంతో వారిని అడ్డుకోలేకపోయాడు. రాడ్లు, హాకీ స్టిక్‌లు, ఇటుకలు, రాళ్లతో ఆ మూక తరుణ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో తరుణ్ స్పృహ తప్పి పడిపోయినా వారు వదలకుండా అతడిని తీవ్రంగా కొట్టి.. కత్తులతో పొడిచారు. తరుణ్ కింద పడి.. రక్తపు మడుగులో ఉన్నా వారు కనికరించలేదని బాధితుడి తండ్రి మమ్రాజ్ చెప్పారు.


ఈ ఘటనతో ఉత్తమ్ నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మూకకు చెందిన కారు, బైక్‌లకు ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటివరకు ఒక మైనర్‌ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. నిందితులను పట్టుకోవాలని.. ఈ కేసును సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాలని తరుణ్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ నిరసనల్లో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు పాల్గొన్నాయి.

Latest News
Saka seals Arsenal's place in Champions League final Wed, May 06, 2026, 12:29 PM
UN welcomes Russian, Ukrainian unilateral ceasefires Wed, May 06, 2026, 12:25 PM
New Zealand unemployment down to 5.3 pc in Q1 Wed, May 06, 2026, 12:20 PM
TVK reaches out to CPI for support as Vijay intensifies bid to form govt in TN Wed, May 06, 2026, 12:15 PM
Bihar Cabinet meeting today as NDA finalises strategy for upcoming expansion Wed, May 06, 2026, 12:14 PM