|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 06:14 PM
అమ్మాయి అప్పటికే ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ ఇంట్లో వాళ్లకు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. మరో అబ్బాయితో పెళ్లిని ఖాయం చేస్తారు. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. అయినా ఆ అమ్మాయి తాను ప్రేమించినవాడు వస్తాడని.. తనను మండపం నుంచి తీసుకెళ్తాడనే ధీమాతో ఉంటుంది. ముహూర్తం సమయానికి ప్రియుడు ఎంట్రీ ఇవ్వడం.. వధువు పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోవటం వంటివి తెలుగు సినిమాల్లో రొటీన్ సీన్లు. సరిగ్గా ఇలాంటి సినీ ఫక్కీ ఘటన ఒకటి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జరిగి అందరినీ విస్తుపోయేలా చేసింది. మంగళ వాయిద్యాలు, బంధువుల కోలాహలంతో సందడిగా ఉన్న పెళ్లి మండపం.. ఒక్కసారిగా రణరంగంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. మైలవరం నియోజకవర్గంలోని రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీ యువకులకు పెద్దలు వివాహం నిశ్చయించారు. శుక్రవారం (మార్చి 6) రాత్రి వరుడి నివాసం వద్ద అట్టహాసంగా వివాహ వేడుక జరుగుతోంది. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర-బెల్లం కూడా పెట్టుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో మాంగల్య ధారణ జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా ఓ యువకుడు మండపం వద్దకు చేరుకున్నాడు. అతడిని చూడగానే వధువు పీటల మీద నుంచి లేచి, 'వచ్చావా..' అంటూ అతడి పక్కనే వెళ్లి నిలబడింది. తాను అతడిని ప్రేమిస్తున్నానని.. ఈ పెళ్లి ఇష్టం లేదని అందరి ముందూ తేల్చి చెప్పడంతో వరుడు సహా బంధువులందరూ నిర్ఘాంతపోయారు.
ఈ అనూహ్య పరిణామంతో ఆగ్రహానికి గురైన వరుడి తరపు బంధువులు సదరు యువకుడిపై చేయి చేసుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 'మాకు ఉన్నది ఒక్కగానొక్క కుమారుడు. రూ. 20 లక్షలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశాం. వేల మందికి విందు భోజనాలు వడ్డించాం. తీరా సమయానికి ఇలా చేసి అందరిలో మా పరువు తీశారు' అంటూ వరుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
చివరకు శనివారం గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాల వారు పంచాయితీ నిర్వహించి, వివాదాన్ని సర్దుమణిగేలా చేసుకున్నారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు తన ప్రియుడితో వెళ్లగా.. వరుడి కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు చూసి చప్పట్లు కొట్టే జనం, నిజ జీవితంలో ఇలాంటి ఘటన జరగడంతో పెళ్లికి వచ్చిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.
Latest News