|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 08:11 PM
ప్రపంచ యవనికపై భారతదేశం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారుతోందని, భవిష్యత్ సాంకేతికతకు అమరావతి కేంద్రబిందువు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ప్రతిష్టాత్మక 'రైసినా డైలాగ్-2026' సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ వేదికపై ప్రసంగించేందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం విశేషం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమక్షంలో110 దేశాలకు చెందిన ప్రతినిధుల ముందు చంద్రబాబు ఏపీ విజన్‌ను ఆవిష్కరించారు.గతంలో సైబరాబాద్ నిర్మాణంతో ఐటీ విప్లవానికి బాటలు వేసిన అనుభవంతో ఇప్పుడు అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం ప్రకటించారు. కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను ప్రపంచానికి అందించే హబ్‌గా ఏపీని మారుస్తామన్నారు. అమరావతిని కాలుష్య రహిత బ్లూ-గ్రీన్ సిటీగా, తొమ్మిది రకాల వినూత్న నగరాల సమాహారంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో గూగుల్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటం టెక్నాలజీలే దేశాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అందుకే ఏపీలో ఏఐ ఆల్గారిథమ్స్, ట్రైనింగ్‌కు పెద్దపీట వేస్తున్నామని వివరించారు.ఒకప్పుడు భారతీయ మేధావులు అవకాశాల కోసం సిలికాన్ వ్యాలీకి వెళ్లేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి 'రివర్స్ మైగ్రేషన్' మొదలైందని చంద్రబాబు విశ్లేషించారు. నిపుణులు ఎక్కడుంటే అవకాశాలు అక్కడికే వస్తాయని, ప్రస్తుతం ప్రపంచ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 60 శాతం భారత్‌లోనే ఉండటం మన సత్తాకు నిదర్శనమని చెప్పారు. గ్లోబల్ లీడర్లను తయారు చేసేందుకు అమరావతిలో లీడర్‌షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.సదస్సులో జనాభా అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాము ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనాభా వృద్ధిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దక్షిణాదిలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి పడిపోవడం ఆందోళనకరమనిదీనిని 2.1కి పెంచే లక్ష్యంతో 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ'ని తెచ్చామని చెప్పారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, మూడో బిడ్డకు రూ.25 వేల ఆర్థిక సాయం వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. మైక్రో ఫ్యామిలీల నుంచి ఉమ్మడి కుటుంబాల వైపు ఆలోచన మారాల్సిన అవసరం ఉందన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే భారత్ ఇతర దేశాలకు విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే సహకార సమైక్యవాదం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Latest News