|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 06:13 PM
పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం భయపెడుతోంది. దీంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో బతుకుతున్నారు. పోలవరం జిల్లాలోని అడ్డతీగల మండలంలో ఉన్న కృష్ణవరం గ్రామంలో ఆవులపై పెద్దపులి దాడి చేసింది. గంగవరం మండలం ట్యాంకుబీడు ప్రాంతం నుంచి పెద్దపులి శుక్రవారం అర్ధరాత్రి కృష్ణవరం చేరుకున్నట్లు తెలిసింది. కృష్ణవరంలో ఆవులపై దాడి చేసి ఓ ఆవు, దూడను చంపేసింది. దీంతో ఈ ప్రాంతవాసులు మరింత భయపడిపోతున్నారు. ఇటీవలే ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటన మరువకముందే మరోసారి ఆవులపై దాడి చేయడం కలవరం రేపుతోంది. మరోవైపు ఈ ఘటనతో ట్యాంకుబీడు గ్రామం నుంచి అటవీ శాఖ అధికారులు బోనులను తరలిస్తున్నారు.
మరోవైపు ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోనే పెద్దపులి తిరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాకినాడ, పోలవరం జిల్లా సరిహద్దులలో పులి అడుగుజాడలను గుర్తించటం ఇందుకు బలం చేకూరుస్తోంది. అడ్డతీగల మండలంలోని గొట్టువానిపాలెం గ్రామంతో పాటుగా.. ఏలేశ్వరం మండలంలోని మర్రివీడు ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల, రాజవొమ్మంగి, ఏలేశ్వరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. అయితే శుక్రవారం రాత్రి అడ్డతీగల మండలంలోని కృష్ణవరంలో ఆవులపై పెద్దపులి దాడి చేయటంతో ఆందోళన అధికమైంది.
మరోవైపు పెద్దపులిని బంధించేందుకు అధికారులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రాంత పరిస్థితులు అందుకు సహకరించడం లేదు. భౌగోళిక ప్రతికూలతల కారణంగా పులి బంధించటం కష్టంగా మారుతోంది. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. అయితే పెద్దపులి బోను దరిదాపుల్లోకి కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
పెద్దపులి సంచారంపై హెచ్చరిస్తూ గ్రామాల్లో దండోరా వేయించటంతో పాటుగా ఆలయాల మైక్ సెట్ల ద్వారా జాగ్రత్తలు చెప్తున్నారు. రాత్రివేళ బయటకు రావొద్దంటూ సూచిస్తున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా పెద్దపులిని బంధించి.. సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం భయంభయంగా గడపలేకపోతున్నామని.. అధికారులు వెంటనే పులిని బంధించాలని కోరుతున్నారు.
Latest News