|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:43 PM
అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల మధ్య కుదిరే ఒప్పందాలు కొన్నిసార్లు కేవలం కాగితాలకే పరిమితం అవుతాయనే విమర్శలకు సౌదీ అరేబియా-పాకిస్థాన్ రక్షణ బంధం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కుదుర్చుకున్న పరస్పర రక్షణ ఒప్పందం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం వారితో నిలిచి పగ తీర్చుకోవాలని కుదుర్చుకున్న ఈ ఒప్పందం పేరుకు మాత్రమే అన్నట్లుగా మిగిలిపోయింది. ఎందుకంటే.. సౌదీ అరేబియాపై ఇరాన్ ప్రస్తుతం దాడులకు పాల్పడడం, పాకిస్థాన్‌పై అఫ్గాన్ దాడులు చేయడం వంటివి జరుగుతున్నా.. ఇరు దేశాలు ఒకరికొకరు అండగా నిలబడడం లేదు.
ఒప్పందం సారాంశం ఏమిటి?
సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం.. నాటో తరహాలో ఒక దేశంపై దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించాలి. అంటే ఒక దేశం యుద్ధంలో ఉంటే మరో దేశం తక్షణమే తన సైనిక మద్దతును ప్రకటించి రణరంగంలోకి దూకాలి. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ వ్యూహాత్మక ఒప్పందం ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు.
పాక్-అఫ్గాన్ యుద్ధంలో సౌదీ ఎక్కడ?
గత కొద్ది రోజులుగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. పాకిస్థాన్ ఆపరేషన్ ఘజబ్ లిల్ హాక్ పేరుతో కాబుల్‌పై వైమానిక దాడులకు తెగబడింది. దీనికి ప్రతిచర్యగా అఫ్గాన్ దళాలు పాక్ సైనిక అవుట్‌పోస్టులను ధ్వంసం చేయడమే కాకుండా ఒక పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసినట్లు ప్రకటించాయి. ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. తమ రక్షణ భాగస్వామి అయిన సౌదీ అరేబియా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు సరికదా కనీసం దౌత్యపరమైన మద్దతు కూడా లభించలేదు.
సౌదీపై ఇరాన్ దాడులు: పాక్ మౌనం
మరోవైపు సౌదీ అరేబియాపై ఇరాన్ క్షిపణులు చేస్తోంది. డ్రోన్లతో సౌదీ రాజధాని రియాద్‌తో పాటు కీలకమైన చమురు రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని విరుచుకు పడుతోంది. అయితే ఒప్పందం ప్రకారం.. ఈ విషయం తెలిసిన వెంటనే పాకిస్థాన్ తన సైన్యాన్ని సౌదీ రక్షణ కోసం పంపాల్సి ఉండగా ఇస్లామాబాద్ వైపు నుంచి ఎలాంటి కదలిక లేదు. ఈ నిశ్శబ్దం ఇరు దేశాల మధ్య ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. దేశాల మధ్య ఉండే ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల ముందు ఇలాంటి రక్షణ ఒప్పందాలు తరచుగా వీగిపోతుంటాయని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం సౌదీ, పాకిస్థాన్ రెండూ తమ సొంత సమస్యలతో సతమతమవుతూ.. మిత్ర దేశానికి సాయం చేసే స్థితిలో లేవని స్పష్టం అవుతోంది.
Latest News