|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:32 PM
భారత్‌పై దాయాది పాకిస్థాన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. భారత్ మరో యుద్దానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దరీ ఆరోపణలు చేశారు. యుద్ధానికి బదులు భారత్ చర్చలకు రావాలని జర్జారీ వ్యాఖ్యానించారు. మంగళవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత నాయకులు మరో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు.. ప్రాంతీయ శాంతికి మద్దతుదారుడిగా నేను యుద్ధానికి వ్యతిరేకం.. వాళ్లకు (భారత్) నేను చెప్పేదొక్కటే యుద్ధ కాంక్షను వీడి అర్దవంతమైన చర్చలు జరపాలి ఎందుకంటే ప్రాంతీయ భద్రతకు ఇదొక్కటే మార్గం’’ అని పాక్ అధ్యక్షుడు అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తనను బంకర్లలోకి వెళ్లమన్నారని జర్దారీ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో సింధూ నది జలాలను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఇది జల-ఉగ్రవాదమని, రాజకీయ ప్రయోజనాల కోసం న్యూఢిల్లీ నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగిస్తోందని జర్దారీ ఆరోపించారు. ఇదే సమయంలో జమ్మూ కశ్మీర్ అంశం గురించి కూడా పాక్ అధ్యక్షుడు తన ప్రసంగంలో ప్రస్తావించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు దౌత్యపరంగా, నైతికంగా పాకిస్థాన్ మద్దతు కొనసాగుతుందని, కశ్మీర్ సమస్య పరిష్కారం కానంత వరకూ దక్షిణాసియాలో శాశ్వత శాంతి అగమ్యగోచరంగానే ఉంటుందని పాక్ అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అలాగే, అఫ్గనిస్థాన్‌పై కూడా పాక్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. అఫ్గన్‌లో ఉగ్రవాద సమూహాల గురించి ఇటీవల ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికను ఆయన ఉటంకించారు. ‘ఈ సమస్యను విస్మరిస్తే మరో దేశం కూడా విపత్కర దాడికి గురవుతుందని ఐరాస నివేదిక హెచ్చరించింది’ అని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికి సైనిక తీవ్రత పెరగకుండా దౌత్యమార్గాలను పక్కనబెట్టమాని అసిఫ్ అలీ జర్దారీ అన్నారు. ‘నేను స్పష్టంగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను.. పాకిస్థాన్ భూభాగం పవిత్రమైంది.. మా శాంతిని అస్థిరపరిచేందుకు పొరుగుదేశ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి దేశీయ లేదా విదేశీ ఏ సంస్థను మేము అనుమతించం’’ అని ఆయన ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా అఫ్గన్ గడ్డపై ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలను నిరోధిస్తామని దోహా ఒప్పందంలో చేసిన హమీలను నెరవేర్చడంలో తాలిబన్ ప్రభుత్వం విఫలైమందని జర్దారీ దుయ్యబట్టారు. ఉగ్రవాద సమూహాలను నిర్వీర్యం చేసి, ఇతరుల ఆశయాలకు అఫ్గన్ యుద్ధభూమిగా మారకుండా చూడాలని ఆయన కాబూల్‌ను కోరారు. ఇదే సమయంలో ప్రస్తుతం పశ్చిమాలో జరుగుతున్న యుద్ధం, ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యను జర్దారీ తీవ్రంగా ఖండించారు. యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులను ఆయన ఖండించారు.
Latest News