|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 12:06 PM
కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గంలో పేదలైన ప్రతి అర్హుడికి మూడు సెంట్ల ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్” పేరిట అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా, రాష్ట్ర అభివృద్ధికంటే నాయకుల స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై, పేద ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ప్రజల హక్కుల కోసం పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.నగరాలు, పట్టణాల్లో ఉపాధి కోసం వెళ్లి స్థిరపడిన లక్షలాది పేద కుటుంబాలకు సొంత ఇళ్లు లేకపోవడం వల్ల అద్దె భారం మోయడం కష్టమవుతోందని తెలిపారు. గ్రామాల్లో సొంత ఇంటి స్థలం లేక ఒకే గృహంలో రెండు, మూడు కుటుంబాలు కలిసి జీవించడం వల్ల అనవసర వివాదాలు, మనస్పర్థలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News